గులాబీ బ‌లం తేలింది... బీజేపీ దూకుడు పెంచింది
విభాగం: రాజకీయ వార్తలు
bjp-increased-strength-seeing-trs_g2d

తెలంగాణలో ముందస్తు సమరానికి అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఎవరికి వారే తమ అస్త్రాలు, శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి దూకుడుగా వ్యవహ‌రిస్తూంటే... అందుకు తగ్గట్టుగానే ఇతర రాజకీయ పార్టీలు కూడా తమ కార్యక్రమాలను షురూ చేస్తున్నాయి. 

ముందుగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో మరింత దూకుడుగా వ్యవహరించాలని భావిస్తోంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమితికి లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న సమయంలో ఇప్పటి నుంచే దూకుడు పెంచాలని, దాని ద్వారా తెలంగాణ ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాలని భావిస్తున్నారు.  

తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులతో రెండు రోజులుగా టచ్‌లో ఉన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెలలోనే ఎన్నికల కార్యక్రమాలు చేపట్టాలని, 12 న కాని, 15 న కాని మహబూబ‌్ నగర్ నుంచి ఎన్నికల యుద్ధభేరీ మోగించాలని రాష్ట్ర నాయకులకు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. 

తెలంగాణ వ్యాప్తంగా భారీ సభలు పెట్టాలని కూడా పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు జాతీయ స్ధాయిలో అగ్ర నాయకులను తీసుకురావాలని, వారి చేత కేంద్ర ప్రభుత్వం చేసిన వివిధ అభివ్రద్ధి కార్యక్రమాలను వివరించాలని నిర్ణయించారు.  

ప్రగతి నివేదన సభ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజల నుంచి మద్దతు లేదని తేలిపోయిందని భారతీయ జనతా పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ సభకు 25 లక్షల మందిని సమీకరించాలని నిర్ణయం తీసుకున్నా... సభకు కేవలం ఎనిమిది నుంచి 10 లక్షల మంది మాత్రమే హాజరైనట్లు రాష్ట్ర బిజెపి నాయకులు అంచనా వేస్తున్నారు. ఇంటెలిజెన్సీ వర్గాలు కూడా ప్రభుత్వానికి ఇదే విషయాన్ని చెప్పాయని వారంటున్నారు. 

ఇక ప్రగతి నివేదన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రసంగం కూడా సభకు వచ్చిన వారిని అలరించలేదని, ఏదో చెప్తారని ఆశించిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా నిరాశ చెందారన్నది భారతీయ జనతా పార్టీ నాయకుల అంచనా. దీనిని ద్రష్టిలో ఉంచుకుని తెలంగాణలో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్లాలని నిర్ణయించారు. 

ప్రతి అంశాన్ని ఆచితూచి అడుగేయాలని, ఎక్కగా తక్కువవుతున్నామనే భావన రాకూడదని అధిష్టానం స్థానిక నాయకులకు చెప్పినట్లు సమాచారం. వారి ఆదేశాలను అనుసరించి వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసే పనిలో బిజెపి రాష్ట్ర నాయకులున్నట్లు సమాచారం. 

 

 

 

SOURCE:GULTE.COM

04 Sep, 2018 0 364
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved