నేతల కోటి ఒప్పందాలు… కేసుల మాఫీల కోసమేనా
విభాగం: రాజకీయ వార్తలు
covenants-in-the-citizens-...-are-the-cases-of-mafila_g2d

“రాజకీయ నాయకులు – అవినీతి” ఈ రెండింటిని వేరు చేసి చూడడం అంటే… “పగలు – రేయి”ని ఒకేసారి చూడాలని ఆశ పడడమే అవుతుంది. అది ఎలా అయితే జరగదో ఇది కూడా అంతే! రాజకీయాలలోకి వచ్చిన ప్రతి వారు చెప్పే మొట్ట మొదటి మాట “అవినీతి నిర్మూలన, నీతి నిజాయితీలతో కూడిన పాలన” అందిస్తాం అని! అయితే వారు రాజకీయ జీవితం మొదలుపెట్టిన తరువాత ఎదుర్కొనే మొట్టమొదటి ఆరోపణలు కుడా “అవినీతి ఆరోపణలు, అక్రమ సంపాదనే!” ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకులు అధికార పక్షం వారిపై, అధికార పక్షంలో ఉన్న నాయకులు ప్రతిపక్షం వారి పైన ఇటువంటి రాజకీయ విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. రాజకీయ నాయకులు ఇతరులపై విమర్శలు చేసినా, ఇతరుల నుండి విమర్శలు ఎదుర్కొన్నా… చివరికి వారి అంతిమ లక్ష్యం అధికారం సాధించడమే. వారి “కోట్ల” విమర్శలు అధికారాన్ని కూడబెట్టుకోవడానికే అనేది జగమెరిగిన సత్యం. మన దేశంలో రాజకీయ నాయకులు ఇచ్చిన మాట, చెప్పిన హామీలపై ఎంత బలంగా నిలబడతారో… అంతే బలంగా వారిపై మోపబడిన కేసులు కుడా నిలబడతాయన్నది బహిరంగమే. దేశ అభివృద్దే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు, రాష్ట్రాల అభివృద్దే ధ్యేయంగా ఇక్కడి పెద్దలు ఉపన్యాసాలు దంచికొడుతుంటారు. రాష్ట్రాల అభివృద్ధి జరగాలి అంటే కేంద్ర సాయం తప్పనిసరి. ప్రస్తుత పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ కేంద్రం చేతిలో సమాధి కావడానికి సిద్దంగా ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి కారణం మన రాష్ట్రంలో ఉన్న చిన్న, పెద్ద రాజకీయ పార్టీలు అన్ని కూడా కేంద్రంపై రాష్ట్ర ప్రజల ఆశలను, వారి హక్కులను పొందడానికి అవసరమైన వనరులను తీసుకురావడంలో విఫలం చెందాయి అని విశ్లేషకుల భావన. అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం ఉద్యమాలు, పోరాటాలు అని కొంతవరకు కే౦ద్రంపై ఎదురుదాడి చేస్తూ పాలన కొనసాగిస్తుంది. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైఎస్సార్సీపీ, జనసేన పార్టీలు మాత్రం మోసం చేసిన కేంద్రాన్ని వదిలి, రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడ అందరూ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే “మోసం చేయడం తప్పే… మోసపోవడం తప్పే.” ఇక్కడ మోసపోయింది రాజకీయ పార్టీలో లేక ప్రభుత్వాలో కాదు, వారిని నమ్మి ఓట్లు వేసిన సామాన్య ప్రజలు. సామాన్యుడికి “కోటి విద్యలు – కూటి కొరకే” అన్న చందంగా, ఈ రాజకీయ నాయకులకు “కోటి విద్యలు… అధికారం కోసం, అక్రమార్జన కోసమే” అన్నది యదార్ధం. అవినీతి కేసుల నుండి బయట పడడానికే జగన్ బిజెపికి వత్తాసు పలుకుతున్నాడని.., పెన్ డ్రైవ్ ల గుట్టు విప్పకుండా ఉండడం కోసమే పవన్ కేంద్రం జోలికి పోవడం లేదని… చంద్రబాబు అండ్ కో ఆరోపిస్తుంటే, ఓటుకు – నోటు కేసు, చినబాబు అవినీతి బయటకు రాకుండా ఉంచడానికే బాబు ఇన్ని రోజులు మీనమేషాలు లెక్కించారని ప్రతిపక్షాలు విమర్శల దాడి చేసుకొంటున్నారు. కేంద్రం మాత్రం “లోగుట్టు పెరుమాళ్ళ కేరుకా” అన్న చందంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఒక ఆట ఆడుకొంటుంది

 

SOURCE:MIRCHI9.COM

14 Jul, 2018 0 234
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved