కాంగ్రెస్‌కు నిజంగా కేసీఆర్‌ను ఢీకొట్టే సీన్ ఉందా?
విభాగం: రాజకీయ వార్తలు
does-congress-have-dare-to-defeat-kcr_g2d

తెలంగాణ రాజ‌కీయ వేడి తారాస్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. అంచ‌నాలు, విశ్లేష‌ణ‌ల మ‌ధ్య ఎవ‌రికి చిక్క‌ని రీతిలో గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌ అసెంబ్లీ ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్నారు, అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు కూడా. దీంతో అన్నిపార్టీల్లోనూ సంద‌డి మొద‌లైంది. 

రాజ‌కీయంగా ఈ హ‌డావుడి ఎలాగూ ఉండేదే కానీ...ఇంత‌కీ కేసీఆర్‌కు, టీఆర్ఎస్‌కు స‌రైన ప్ర‌త్య‌ర్థి ఎవ‌ర‌నేది స‌హ‌జంగానే వ‌చ్చే సందేహం. ప్ర‌స్తుతం బ‌లాబలాలు, నేతల ఆధారంగా చూస్తే...ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీయే గులాబీ ద‌ళ‌ప‌తిని ఎదుర్కునే స్థాయిలో ఉంది. ముంద‌స్తుకు సిద్ధ‌మ‌ని ఆ పార్టీ నేత‌లు పైకి ప్ర‌కట‌న‌లు చేస్తున్న‌ప్ప‌టికీ...అలాంటి స‌న్న‌ద్ధ‌త ఆ పార్టీ నేత‌ల్లో లేద‌నేది రాజ‌కీయ‌వ‌ర్గాల మాట‌.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా ఇటు పార్టీని అటు ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తుంటే...కాంగ్రెస్ మాత్రం అంత‌ర్గ‌త క‌ల‌హాలు, స‌మ‌స్య‌ల‌తో అత‌లాకుత‌లం అయిపోతోంద‌నేది విశ్లేష‌కుల మాట‌. అధికారపార్టీపై ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా చేసుకోవాలన్న ఆరాటం తప్ప ప్రతిపక్ష హోదాలో కారును ఢకొీట్టే సత్తువను నాలుగేండ్లుగా పెంపొందించుకోలేక పోయిందన్న అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతున్నది. 

అధికార టీఆర్ఎస్‌ ప్రజా వ్యతిరేకవిధానాలకు పాల్పడుతున్నదని చెబుతున్న కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం, ఏ సమస్యపైనా ఇప్పటివరకు పోరాటాలు నిర్వహించలేదు. పాలనాపరంగా టీఆర్ఎస్‌పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతే తమకు కలిసొస్తుందన్న అంచ‌నాలు వేస్తే ప్రధాన ప్ర‌తిప‌క్షంగా వారిపై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం స‌డ‌లుతుంద‌నేది కాద‌ని లేని నిజమ‌ని కొంద‌రు పేర్కొంటున్నారు. 

నాలుగేళ్ల కింద‌ట రాష్ట్రం ఏర్ప‌డిన స‌మ‌యంలో ఉన్న బలహీనతలే ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఇస్తున్న హామీలూ పాతవే కావడం గమనార్హం. హామీలు, పథకాలు, పొత్తులతో గట్టెక్కుతామన్న ఆలోచన తప్ప ఇప్పటికీ సంస్థాగతంగా చాలాచోట్ల నిర్మాణం లేదని కొంతమంది నేతలు చెబుతున్నారు. దీనికి తోడుగా పార్టీలో జరుగుతున్న అనేక పరిణామాలు కాంగ్రెస్‌కు అధికార అంద‌ని ద్రాక్ష చేస్తాయ‌నేది కొంద‌రి విశ్లేష‌ణ‌.

కాంగ్రెస్ పార్టీకి ప్ర‌ధాన స‌మ‌స్య అంత‌ర్గ‌త స్వేచ్ఛ కార‌ణంగా ఏర్ప‌డిన గ్రూపు రాజ‌కీయాలు. రాష్ట్ర స్థాయి నాయకత్వం నుంచి మండల స్థాయి నాయకత్వం ఆ పార్టీలో లుకలుకలు కొనసాగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి నెలకొంది. టికెట్ల కోసం కూడా ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తనకు టికెట్‌ రాకపోతే అతనికి రాకూడదు. ఒకవేళ వేరే గ్రూపుకు టికెట్‌ వచ్చినా తానే ఓడిస్తానంటూ బాహాటంగానే సవాళ్లను విసురుకుంటున్నారు. 

గతంలో ఎన్నికలనాటికి గ్రూపులన్నీ ఏకతాటిపైకొచ్చేవి. అలాంటి నాయకుడు ఇప్పుడు లేరన్నది కాంగ్రెస్‌లో వినిపిస్తున్నది. ఉత్తమ్‌కు తోడుగా కుంతియా పర్యవేక్షిస్తున్నా పరిస్థితిలో మార్పులేదని కొంతమంది నేతలు చెబుతున్నారు. ఇవ‌న్నీ చ‌క్క‌దిద్దుకుంటే త‌ప్ప కేసీఆర్‌కు ధీటైన ప్ర‌త్య‌ర్థిగా నిల‌బ‌డ‌టం....అధికారం కైవ‌సం చేసుకోవ‌డం సాధ్యంకాదంటున్నారు.

 

 

 

SOURCE:GULTE.COM

07 Sep, 2018 0 344
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved