
సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉండటం ఒక ఎత్తు. తనకున్న ఇమేజ్ ను పోగొట్టుకోకుండా ఉండటం మరో ఎత్తు. ఆ విషయంలో ఎంతో కొంతో సక్సెస్ అయిన నేతల్లో సీనియర్ టీడీపీ నేత... మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు ఒకరుగా చెప్పాలి. మోడీ సర్కారులో విమానయాన సంస్థ మంత్రిగా వ్యవహరించిన ఆయన.. బాబు ఆదేశాల నేపథ్యంలో మంత్రిపదవికి రాజీనామా చేసిన తీరు తెలిసిందే.
తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. మోడీ ప్రభుత్వంలో దాదాపు నాలుగేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న ఆయన.. మోడీతో తనకున్న రిలేషన్ ను.. తన పట్ల మోడీ బిహేవ్ చేసిన తీరును ఆయన చెప్పుకొచ్చారు. రూలింగ్ పార్టీలో మిత్రుడిగా నాలుగేళ్లు ఉంటూ.. మళ్లీ అదే పార్టీతో అపోజిషన్ గా ఉండటం కాస్త ఇబ్బందేనన్న ఆయన.. మంచి టీమ్ దొరకటంతో విమానయాన రంగంలో ఎన్నో మార్పులు చేసినట్లుగా అశోక్ గజపతి చెప్పారు.
మోడీ తనకు లభించిన మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారన్నారు. సింపుల్ గా ఉండే మోడీని వేలెత్తి చూపించలేం కానీ.. టీమ్ ను నడిపించే విషయంలో మాత్రం ఆయన సరిగా వ్యవహరించటం లేదన్నారు. ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోలేకపోవటంతోనే తామిప్పుడు విపక్షంలో ఉన్నట్లు రాజు చెప్పారు.
మోడీతో తనకున్న రిలేషన్ గురించి చెప్పిన రాజు.. నమస్కారం అంటే నమస్కారం అన్నట్లు ఉండేదని.. వ్యక్తిగతంగా మాట్లాడినా పూర్తిగా పాలనకు సంబంధించిన విషయాలు వచ్చేవని చెప్పారు. వేరే మాట్లాడటానికి ఆయన వద్ద అవకాశం ఉందన్నారు.
తనను గతంలో లోక్ సభకు వెళ్తారా అని ఎన్టీఆర్ అడిగారని.. కాస్త అనుభవం వచ్చాక వెళ్తే బాగుంటుందని అన్నానని.. ఇప్పుడు అవకాశం వచ్చిందన్న అశోక్.. ఈసారి లోక్ సభకు ప్రయత్నిస్తానన్నారు. మరో ప్రశ్నకు సమాధానంగా రాజకీయాలకు వారసులు ఉండరని.. ఆస్తులకు ఉంటారన్నారు. ఇప్పటికైతే తన రాజకీయ వారసత్వం గురించి మాట్లాడనని చెప్పారు.
తనకు ఇద్దరు కుమార్తెలని.. ఒకరు డాక్టర్ అయితే.. మరొకరు టీచర్ అన్నారు. ఒక కుమార్తె విడాకులు తీసుకొని తమతోనే ఉంటున్నారని.. తమ సంస్థలకు సాయం చేస్తుంటారన్నారు. ఆమెకు రాజకీయాలు అంటే ఇష్టమని తనతో ఇప్పటివరకూ చెప్పలేదన్నారు.
SOURCE:GULTE.COM