
దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ దేశం మొత్తమ్మీదా అమల్లోకి ఉండట తెలిసిందే. ఏడు విడతల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో.. ఇప్పటికే నాలుగు దశలు పూర్తి అయ్యాయి. అయినప్పటికీ.. పోలింగ్ పూర్తి అయిన ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ను ఎత్తి వేయని విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు.. ఫలితాల విడుదల తర్వాత మాత్రమే ఎన్నికల కోడ్ ను ఎత్తేయనున్నారు.
ఇదిలా ఉంటే.. అందుకు భిన్నంగా ఒడిశా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తి వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఊహించని రీతిలో ముప్పుగా మారిన ప్రకృతి వైపరీత్యమే దీనికి కారణంగా చెప్పాలి. ఏపీని వణికించిన ఫొని (తుఫాను) ఒడిశాను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న అంచనా నేపథ్యంలో.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా కోడ్ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని మొత్తం 11 తీర ప్రాంత జిల్లాల్లో కోడ్ ను ఎత్తేశారు. పూరీ.. కేంద్రపడ.. భద్రక్.. బాలాసోర్.. మయూర్ బంజ్.. గజపతి.. గంజాం.. ఖుర్దా.. కటక్.. జాజ్ పూర్ జిల్లాలు ఉన్నాయి. వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీ పరిస్థితుల్ని సమీక్షించిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ పూర్తి అయిన నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఢిల్లీకి వెళ్లి.. ఫోనీ తీవ్రత గురించి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.
సహాయక చర్యలకు వీలుగా ఎన్నికల కోడ్ ఎత్తేయాలని కోరారు. అంతేకాదు.. మే 19కి వాయిదా పడ్డ పాట్ కుర అసెంబ్లీ ఎన్నికను వాయిదా వేయాలని కోరారు. ప్రస్తుతం పూరీకి 710 కిలోమీటర్లదూరంలో కేంద్రీకృతమైన తుపాను మే 3 నాటికి పారాదీప్ సమీపంలో తీరం దాటే వీలుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
SOURCE : GULTE