టీడీపీకి దాని వల్లనే పెద్ద ఎదురుదెబ్బ
విభాగం: రాజకీయ వార్తలు
is-it-a-big-blow-to-tdp_g2d

నాలుగేళ్ల కిందట ఏపీలో అధికారాన్ని సొంతం చేసుకుంది అధికార పార్టీ. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడే ఒకమాట చెబుతున్నారు. చాలామంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు అని. తన సర్వేలు అవే విషయాలను చెబుతున్నాయని చంద్రబాబు నాయుడు పార్టీ సమన్వయ కమిటీ సమావేశాల్లో చెబుతున్నారు. వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వాళ్లకు టికెట్లు ఇచ్చే సమస్యేలేదు అని, గెలుస్తారనే వారికే టికెట్లు అని బాబు స్పష్టంగా కుండబద్ధలు కొడుతున్నారు.

కొత్తవాళ్లకు కావాలంటే టికెట్లు ఇవ్వడానికి కూడా తను వెనుకాడను అని కూడా చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తున్నారు. ఇదే జరగబోతోందని.. చాలామంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు వచ్చేసారి టికెట్లు దక్కే అవకాశం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. రాయలసీమలో ఈ పరిస్థితి ఉండబోతోందని చాన్నాళ్లుగానే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? సాధారణంగా ఒకసారి ఎమ్మెల్యే పదవిని అనుభవించిన వాళ్లు రెండోసారి దాన్ని నిలబెట్టుకోవడం కష్టంకాదేమో అనుకుంటాం. చేతిలో అధికారం ఉండటం, ప్రజలకు చేరువయ్యే అవకాశం ఉండటం.. మళ్లీవాళ్లను గెలిపించాలి.

ప్రత్యేకించి అధికార పార్టీ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉండటం అంటే అంతకు మించిన వరంలేదు. వ్యక్తిగతంగా పేరు తెచ్చుకోవచ్చు. పార్టీకి మంచిపేరు తెచ్చి పెట్టవచ్చు. మరోసారి గెలుపుకు బాటలు వేసుకోవచ్చు. అయితే ఎన్నికలయ్యాకా నాలుగేళ్లకు, ఎన్నికలు మళ్లీ దగ్గరపడుతున్న వేళ టీడీపీ సిట్టింగులు మాత్రం బాగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని స్పష్టం అవుతోంది. రాయలసీమ వరకూ తీసుకొంటే.. సగంమంది సిట్టింగులకు టికెట్లు ఇవ్వడం బాబుకే ఇష్టంలేదని, వీరి స్థానాల్లో వేరే వారిచేత పోటీచేయించడానికి బాబు ఆసక్తితో ఉన్నారని స్పష్టం అవుతోంది.

తెలుగుదేశం అంతర్గత వర్గాల్లో కూడా ఈ ప్రచారం సాగుతోంది. టీడీపీకి సీమలో ఎక్కువ సీట్లు ఇచ్చిన అనంతపురంలోనే సగంమంది సిట్టింగులకు బాబు నో చెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో సిట్టింగులకే మళ్లీ పోటీచేసే ఆసక్తిలేదని, ఒక ఫిరాయింపు మంత్రి నియోజకవర్గం మారడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక కడపలో ఉన్నదే ఒక్క సీటు... అది చేజారడం గ్యారెంటీ. ఇక ఫిరాయింపు మంత్రి జిల్లాలో మొత్తానికే పార్టీని ముంచేలా ఉన్నాడు. కర్నూలులోనూ ఇదేకథ. ఇక్కడా సిట్టింగులు, ఫిరాయింపుదార్లు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.

ఓవరాల్‌గా గత ఎన్నికల్లో ఎవరైతే గెలిచి వచ్చి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో.. వారే ఇప్పుడు టీడీపీకి గుదిబండలుగా మారారని రాజకీయ పరిస్థితులు సూఛాయగా చెబుతున్నాయి. ఇంతకీ ఇలా ఎందుకు తేడాకొడుతోంది? అంటే.. నేతల స్వార్థమే ఈ పరిస్థితికి కారణం అని చెప్పాలి. గత ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల్లో చాలామంది కేవలం తమ వ్యక్తిగత స్వార్థం మాత్రమే చూసుకున్నారని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ నేతలు అన్నాకా అవినీతి చేస్తారు.. అనే అభిప్రాయంతో ఉండే కార్యకర్తలు, ఆ అవినీతిలో తమకు కూడా ఎమ్మెల్యేలు ఎవరూ భాగం ఇవ్వడంలేదని చెబుతున్నారు.

ఏ ఎమ్మెల్యే దీనికి మినహాయింపు కాదు, ఏ మంత్రీ దీనికి మినహాయింపు కాదు.. వీళ్లంతా కేవలం తాము సంపాదించుకోవడానికే ప్రాధాన్యతను ఇస్తున్నారని వీరివెంట ఉన్నవాళ్లు చెబుతున్నారు. ప్రధానంగా కాంట్రాక్టుల విషయానికి వస్తే వీళ్లు నిత్యం వెన్నంటే ఉండి, జేజేలు కొట్టేవాళ్లకు కూడా ఛాన్సులు ఇవ్వడంలేదు. చిన్నపని, పెద్దపని తేడాలేకుండా.. ప్రతిదాన్నీ ఎమ్మెల్యేలు, మంత్రులే చేపడుతున్నారని... దీనికి ఏనేతా మినహాయింపు కాదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి అధికార పార్టీల నుంచి.

అన్ని పనులు వదులుకుని ఎమ్మెల్యేల వెంట, నేతల వెంట తిరిగే వాళ్లకు.. పార్టీ ముద్ర వేయించుకునే వాళ్లకు కచ్చితంగా ఈజీ మనీ మీద ఆశలు ఉండనే ఉంటాయి. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.. కాంట్రాక్టులు చేయాలని, దందాలు చేయాలని వీళ్లకు ఆసక్తులు ఉంటాయి. టీడీపీలోని వారికే ఇప్పుడు ఆ అవకాశాలు దొరకడం లేదట. అన్నీ ఎమ్మెల్యేలే చేసేస్తున్నారు. మారుతున్న రాజకీయంలో.. ఎమ్మెల్యేలే సాంతం నాకేస్తున్నారు. దీంతో పక్కనున్న వారిలోనే అసహనం మొదలవుతోంది. వీడికోసం మనమింత తిరిగినా ప్రయోజనంలేదు.. అనే అభిప్రాయాలు పచ్చపార్టీలోని వారి నుంచినే వినిపిస్తున్నాయి.

అందుకే ఏ ఎమ్మెల్యే ఎంతతిన్నాడు, ఎలా తిన్నాడు, ఎక్కడ నొక్కాడు.. అనే అంశాల గురించి పూర్తి వివరాలు చంద్రబాబు వరకూ వెళ్లిపోతున్నాయి. నేతలు మరీ స్వార్థ పరులుగా మారారని, గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని.. పార్టీని నమ్ముకుంటే ఎంతోకొంత ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయాలుండేవి. ఇప్పుడు దోపిడీ అయితే ఆగడంలేదు. ఆ దోపిడీ మొత్తం ఎమ్మెల్యేలు, వారి ఇంట్లో వాళ్లు మాత్రమే చేస్తున్నారు.

దీంతో మిగతావాళ్లకు చిర్రెత్తుకొస్తోంది. ప్రజల్లో ప్రబలిన వ్యతిరేకత దీనికి బోనస్‌. అందుకే.. సిట్టింగులపై వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న విషయం తేలిపోతోంది. చంద్రబాబుకు ఈ మేరకు రిపోర్టులు అందాయి. అందుకే కొత్త ఫేసుల కోసం ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. పాతవాళ్లను మళ్లీ నిలబెడితే పార్టీ కార్యకర్తలు కూడా సహకరించే పరిస్థితి లేదని చంద్రబాబు సర్వేలే తేల్చి చెప్పాయట

 

SOURCE:GREATANDHRA.COM

01 Jul, 2018 0 561
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved