
జనసేన పార్టీ సిద్దాంతాలు, విధి విధానాలు, లక్ష్యాలను తెలియచేసే కరదీపికను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురువారం విడుదల చేశారు.
హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కరదీపికను, పార్టీ తరఫున ప్రారంభించిన పక్ష పత్రిక 'శతఘ్ని'ని విడుదల చేశారు. పార్టీ శ్రేణులకు సిద్దాంతాలపై అవగాహన కల్పించడంతోపాటు, వారికి దిశానిర్దేశం చేసేలా కరదీపిక ఉంటుంది. జనసేన సంకల్పం ఏమిటనేది ప్రతి పాఠకుడికి తెలియచేసేలా శతఘ్ని పత్రిక ఉంటుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ బలమైన సిద్దాంతాలు ఉన్న ఒకే ఒక్క పార్టీ జనసేన. టీడీపీ, వైసీపీలకు సిద్దాంతాలు లేవు. మన అధ్యక్షులు ఏడు సిద్దాంతాలను మనకు అందించారు.
అవినీతిరహిత సమాజం స్థాపనే లక్ష్యంగా జనసేన ముందుకు వెళ్తుంది. అలాగే మన పార్టీకి సంబంధించిన విషయాలను తెలియచేసేందుకు 'శతఘ్ని' పేరుతో పక్ష పత్రికను తీసుకువస్తున్నాం. పార్టీ శ్రేణులకు డిసెంబర్ నెలాఖరుకి 50 లక్షల సభ్యత్వ నమోదు చేయాలనీ లక్ష్యంగా నిర్ణయించాం. అలాగే ఈ నెలలోనే 'వాడవాడ జనసేన జెండా' అనే కార్యక్రమం నిర్వహించనున్నాం. ప్రతి జిల్లా కేంద్రం, మండల కేంద్రం, గ్రామం, బూత్ స్థాయిలో జనసేన జెండా ఎగరాలి" అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ శ్రీ మాదాసు గంగాధరం పాల్గొన్నారు.