
జన సేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించడానికి ప్రవాహసదృశమైన జన గోదావరి.. ఉరకలెత్తి.. గట్టు దాటుకుని వచ్చిందా అనిపించినంత జనసందోహం. నిక్కచ్చిగా ప్రజల కోసం పనిచేస్తూ.. పాలకుల దురాలోచనలను, దుర్మార్గాలను ఎండగడుతూ.. నవశకం రాజకీయాలను ఆవిష్కరించే క్రమంలో కవాతుగా తరలివచ్చి.. సర్ ఆర్థర్ కాటన్ వారధి దాటిన..జనసేనానిని జనగోదావరి హర్షధ్వానాలతో అభిషేకించింది.
సోమవారం మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకి ధవళేశ్వరం బ్యారేజీ ఎక్కిన శ్రీ పవన్కళ్యాణ్ గారు, వేదిక వద్దకి చేరుకోవడానికి మూడు గంటలకి పైగా సమయం పట్టింది. విజ్జేశ్వరం వద్ద కాన్వాయ్ మొదలైంది. ఆ వెంటనే పారా గ్లైడర్లలతో ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి జనసంద్రాన్ని దాటుకుని కవాతు ప్రారంభ వేదిక పిచ్చుకలంక చేరుకోవడానికి గంట సమయం పట్టింది. అక్కడి నుంచి కవాతు చేద్దామంటే శ్రీ పవన్కళ్యాణ్ గారు వాహనశ్రేణి దిగి కిందికి అడుగుపెట్టేందుకు అవకాశం దొరకలేదు. బ్రిడ్జిపై కెపాసిటీకి కొన్ని రెట్ల జనం చుట్టూ మూగేశారు. దీంతో వాహనశ్రేణి కూడా ముందుకి కదలడానికి జన ఉప్పెనకి ఎదురీదాల్సి వచ్చింది. ధవళేశ్వర్యం బ్యారేజీ నుంచి ఎటు చూసినా కొన్ని కిలోమీటర్ల దూరం లక్షలాది జనసైనికులు వచ్చారన్న ఆనవాలు చూపుతూ శ్వేతరుధిరవర్ణ భరితమై కనువిందు చేసింది. జనసైనికులు పెద్ద పెట్టున సిఎం..సిఎం అంటూ నినాదాలు చేస్తుంటే,గోదావరి తీరం ఏ నినాదాల్ని ప్రతిధ్వనింపచేసింది. లక్షలాదిగా తరలి వచ్చిన జనసేన కార్యకర్తలు జయజయ ధ్వానాలు చేస్తుంటే, శ్రీ పవన్కళ్యాణ్ గారు కూడా మధ్య మధ్యన కారు టాప్ మీదికి వచ్చి.. జనసేనది ఉక్కు పిడికిలి అని చూపిస్తూ వారిని మరింత ఉత్సాహపరిచారు. జనసైన్యపు ప్రవాహ ఉదృతికి ధవళేశ్వరం బ్యారేజీ పట్టక పోవడంతో, కొన్ని వేల మంది లాకుల పైకి ఎక్కారు. మరి కొన్ని వేల మంది గోదావరీ ప్రవాహానికి అడ్డంగా కవాతు చేశారు. ఆడ, మగ, చిన్నా,పెద్దా, కులం,మతం బేధాలు లేకుండా, అన్ని వర్గాలు కవాతులో మేముసైతం అంటూ జనసేన అధినేత వెనుక కదం తొక్కాయి. శ్రీ పవన్కళ్యాణ్ గారు ధవళేశ్వరం దగ్గర బ్యారేజీ దిగే సమయంలో, ఓ వైపు జలప్రవాహం ఉరుకులు పెడుతుంటే, అంతకు మించిన జనప్రవాహం గంటల తరబడి వంతెన దాటుతూ కనిపించిన దృశ్యం కనువిందు చేసింది.
జనసేన పార్టీ జెండాలతో పాటు శ్రీ పవన్కళ్యాణ్ గారి ఫోటోలు, విప్లవ వీరుడు చేగువేరా, దేశ నాయకుల ఫొటోలు చేతబూని, జాతీయతని చాటుతూ జనసైనికులు అనుసరించారు. అక్కడ శ్రీ పవన్కళ్యాణ్ గారిని కొన్ని లక్షల మంది అనుసరిస్తే, కాటన్ విగ్రహం వద్ద ఉన్న సభా ప్రాంగణం ఇరువైపులా సుమారు కిలోమీటర్ జనంతో కిక్కిరిసింది. జనసేన అధినేత పిలుపుతో ఉదయం నుంచే కవాతులో పదం కలిపేందుకు లక్షలాదిగా జనం ధవళేశ్వరానికి ఉన్న అన్ని దారుల నుంచి తరలివచ్చారు. శ్రీ పవన్కళ్యాణ్ గారి కవాతుకి మద్దతుగా మత్సకారులు గోదావరిలో పిచ్చుకలంక నుంచి ధవళేశ్వరం వరకు పడవల వరుస కట్టారు. వందలాది నావలు మూడు వరుసల్లో జనసేన జెండాలతో ఈదాయి. మరికొంత మంది మత్స్యకారులు తమ పడవలకి జనసేన అధినేతకి స్వాగతం పలికే బ్యానర్లతో కూడిన తెరచాపల్ని కట్టారు. ధవళేశ్వరం బ్యారేజ్ మొత్తం జనసేన జెండాలు, తోరణాలు, పార్టీ నాయకుల బ్యానర్లతో నిండిపోయింది. కొంత మంది జనసైనికులు ఓ భారీ పట్టాపై మూడు రంగులు జెండా మీద మధ్యన శ్రీ పవన్కళ్యాణ్ గారి చిత్రపటాన్ని ముద్రించి ఊరేగించారు. ఇక గోదావరి మధ్యన ఉన్న దిబ్బలు సైతం జనసేన జెండాలతో వర్ణశోభితంగా దర్శనమిచ్చాయి. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జాతీయ వాదాన్ని బలపరుస్తూ కవాతు, ఆద్యంతం జనసేన జెండాలతో పాటు జాతీయ జెండాలు కూడా రెపరెపలాడాయి. వామపక్షాలు, దళిత సంఘాల మద్దతు నేపధ్యంలో ఎర్రజెండాలు, నీలి జెండాలు కూడా సభా ప్రాంగణం వద్ద దర్శనమిచ్చారు. ఉదయం 6-7 గంటల ప్రాంతంలోనే కవాతుకి తరలి వచ్చే జనసైనికుల వాహనాలతో రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. అన్ని లక్షల మంది జనసైనికులు కవాతుతో కదం తొక్కినా, జనసేన అధినేత సూచనతో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కదిలి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ పవన్కళ్యాణ్ గారు సభా స్థలికి చేరుకునే సమయంలో వేదికపై మోగిన ఢమరుక నాదాలు అలరించాయి. వేదిక పైకి ఎక్కగానే తూర్పు గోదావరికి చెందిన ఆడపడుచులు హారతులు ఇచ్చి జిల్లాలోకి ఘనంగా స్వాగతం పలికారు.
SOURCE:JANASENA.ORG