కె.కె.సెంధిల్ కుమార్‌ ఇంటర్వ్యూ
విభాగం: సినిమా వార్తలు
kalyandev-is-going-to-be-a-good-actor-kk-senthil-kumar_g2d

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు ‘కళ్యాణ్ దేవ్’ తొలి చిత్రం విజేత జులై 12వ తేదీన విడుదల అవుతుంది. ఈ సందర్భంగా, ఆ చిత్రం యొక్క సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంధిల్ కుమార్‌ తో మేము సంక్షిప్తంగా చిట్ చాట్ చేశాము. ఇప్పుడు ఆ విశేషాలు మీ కోసం..

మీరు విజేత చిత్రంలోకి ఎలా అడుగు పెట్టారు ?

నేను బాహుబలి తరువాత ఏ చిత్రం చేయాలనే గందరగోళంలో ఉన్న సమయంలో ఒక రోజు నేను రాజమౌళి ఫామ్ హౌస్లో నిర్మాత సాయి కొర్రపాటిగారిని కలుసుకున్నాను. అప్పుడు ఆయన విజేత గురించి చెప్పారు. సాయిగారు నన్ను ప్రాజెక్టులో భాగం కావాలని అడిగినప్పుడు, కొంచెం సంశయంతోనే సరే అని చెప్పాను. ఆ తర్వాత దర్శకుడు రాకేశ్ శశి పూర్తి కథ వినిపించి స్క్రిప్ట్ అందించాడు. కథ నాకు బాగా నచ్చింది. దాంతో మనస్ఫూర్తిగా ఈ ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను.

అసలు విజేత అంటే ఏమిటి?

ఇది ఒక మంచి కుటుంబ కథా చిత్రం. తండ్రి – కొడుకుల మధ్య సాగుతూ వారి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ చిత్రంలో ప్రతి భావోద్వేగ సన్నివేశం చాలా సహజంగా ఉంటుంది. అనేక సందర్భాల్లో సినిమాలోని పాత్రలతో ప్రేక్షకులు మమేకం అవుతారు.

బాహుబలి వంటి భారీ చిత్రం తర్వాత విజేత లాంటి చిన్న చిత్రానికి పనిచేస్తున్నపుడు ఇబ్బందిగా అనిపించలేదా ?

బాహుబలి బడ్జెట్ వేరు, ఆ స్పాన్ వేరు. ఇక ఈ చిత్రానికి బడ్జెట్ పరిమితులు ఉన్నాయి, వాట్ని దృష్టిలో ఉంచుకోనే పనిచేశాను. ఒకరకంగా నా కెరీర్ మొదలైన ఆ రోజుల్లోకి వెళ్లి పని చేసినట్లు అనిపించింది.

మీ హీరో కళ్యాణ్ దేవ్ గురించి చెప్పండి ?

షూటింగ్ ప్రారంభంలో తనకి ఆ వాతావరణం పూర్తిగా కొత్త. కానీ తరువాత అలవాటు చేసుకున్నాడు. కళ్యాణ్ దేవ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కళ్యాణ్ దేవ్’కి మంచి నటుడయ్యే సామర్ధ్యం ఉంది. భవిష్యత్తులో తాను మంచి నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకుంటాడు. తనకి కష్టపడే స్వభావం ఉంది. ఈ సినిమా బాగా రావటానికి చాలా కృషి చేశాడు.

మీకు బాలీవుడ్ నుండి ఆఫర్లు వచ్చాయా ?
అవును. బాలీవుడ్ నుండి కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ నేను ఆ స్క్రిప్ట్ లకి కనెక్ట్ కాలేకపోయాను. ఏమైనా బాహుబలి తర్వాత విజేతకి పని చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను.

రాజమౌళి, దేవ కట్ట కలిసి భాహుబలి ప్రీక్వెల్ కి దర్శకత్వం వహిస్తున్నారు కదా ? మరి దానికి కూడా మీరు పని చేస్తున్నారా ?

బాహుబలి ప్రీక్వెల్ ఒక వెబ్ సిరీస్ లా తీయనున్నారు. కానీ రాజమౌళి, దేవ కట్ట ఇద్దరూ దర్శకత్వం చేస్తున్నారనేది నిజం కాదు. దేవ కట్ట మాత్రమే దర్శకత్వం వహిస్తున్నారు. రాజమౌళి పర్యవేక్షిస్తారు. ఇక నేను ఆ వెబ్ సిరీస్ కి పని చెయ్యట్లేదు.

మీ తర్వాత చిత్రాలు ఏమిటి ? దర్శకుడిగా మారుతున్నారని వార్తలు వస్తున్నాయి నిజమేనా ?

డైరెక్టర్ అవ్వాలని ప్రతి టెక్నీషియన్ కు ఉంటుంది.దానికి నేను మినహాయింపు ఏమి కాదు. నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కాని మెగాఫోన్ పట్టుకోవటానికి ఆత్రుత ఏం లేదు. కొంత సమయం తీసుకున్నా మంచి అర్ధవంతమైన చిత్రంతోనే మీ ముందుకు వస్తాను

 

SOURCE:123TELUGU.COM

06 Jul, 2018 0 405
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved