క‌వాతు బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న కాదు.. బాధ్య‌త‌గా ఉండ‌మ‌ని చెప్ప‌డానికే - శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు...
విభాగం: రాజకీయ వార్తలు
kavathu-is-not-to-show-strength-says-pawan_g2d

 ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజీ మీద చేప‌ట్టిన క‌వాతు బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న కాదు.. ప్ర‌భుత్వాల‌కి బాధ్య‌త‌ని గుర్తు చేసేందుకు ప్ర‌జ‌లు చేసిన హెచ్చ‌రిక అని జ‌న‌సేన అధ్యక్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు స్పష్టం చేశారు. మంగ‌ళ‌వారం రాజ‌మహేంద్రవరంలో జ‌న‌సైనికుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. క‌వాతుకి స‌హ‌క‌రించి ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఈ సంద‌ర్బంగా శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు మాట్లాడుతూ "దాదాపు ప‌ది ల‌క్ష‌ల మంది క‌వాతుకి వ‌చ్చి బ్యారేజీ మీద న‌డిచారు. వీరంతా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని చూడ‌డానికి రాలేదు. పలావు ప్యాకెట్‌కి ఆశ‌ప‌డో, సారా ప్యాకెట్ ఇస్తార‌నో రాలేదు. దోపిడి ప్ర‌భుత్వాల‌కి హెచ్చ‌రిక చేయ‌డానికే వ‌చ్చారు. ప్ర‌జా ప్ర‌తినిధులు బాధ్య‌త‌తో మెల‌గాల‌ని హెచ్చ‌రిక చేయ‌డానికే వ‌చ్చారు. పాల‌కులు బాధ్య‌త‌తో మెల‌గాలి. ప్ర‌తిప‌క్ష నేత బాధ్య‌త‌తో మెల‌గాలి. అసెంబ్లీకి వెళ్లాలి.. స‌మ‌స్య‌ల‌పై మాట్లాడాలి. ముఖ్య‌మంత్రి అయ్యాక చేస్తా అంటే ఎలా..?  నాయ‌కుల్లో రాజ‌కీయ జ‌వాబుదారీత‌నం పూర్తిగా పోయింది. ఆ జ‌వాబుదారీత‌నాన్ని గుర్తు చేయ‌డానికే ఈ క‌వాతు కాన్సెప్ట్ ఎంచుకున్నా. క‌వాతు అనేది మిల‌ట‌రీ మాత్ర‌మే నిర్వ‌హిస్తారు. ప్ర‌జ‌లు చేయ‌రు. శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పిన‌ప్పుడు, స‌మాజంలో ప్ర‌త్యేక ప‌రిస్థితులు ఉత్ప‌న్న‌మైన‌ప్పుడు, చాలా బ‌ల‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించ‌డానికి క‌వాతు చేస్తుంది. జ‌న‌సేన క‌వాతు ల‌క్ష్యం కూడా అదే. ప్ర‌జ‌ల ధ‌న‌,మాన‌, ప్రాణాల‌కి ర‌క్ష‌ణ లేక‌పోతే, శాంతిభ‌ద్ర‌త‌లు అదుపుత‌ప్పిదే, చాలా తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని చెప్ప‌డ‌మే క‌వాతు ల‌క్ష్యం. అన్ని రాజ‌కీయ పార్టీలు, వ్య‌వ‌స్థ‌లు ఉండ‌గా క‌వాతు ఎందుకు పెట్టాల్సి వ‌చ్చింది..?  నిజంగా మ‌న రాజ‌కీయ నాయ‌కులు, వ్య‌వ‌స్థ రాజ్యాంగం నిర్ధేశించిన విధంగా, ఆదేశించిన సూత్రాల ప్ర‌కారం న‌డిస్తే స‌మ‌స్య‌లు ఉండ‌వు. ఒక చ‌ట్టాన్ని అతిక్ర‌మించేందుకు, వ‌క్రీక‌రించేందుకు ర‌క‌ర‌కాల ప‌రిస్థితుల్లో వ్య‌క్తిగ‌త ల‌బ్ది కోసం  వాటిని వక్ర మార్గంలో అన్వ‌యించుకున్న‌ప్పుడే స‌మ‌స్య‌. వ్య‌వ‌స్థ కులాలు, మ‌తాలు, ఆశ్రిత ప‌క్ష‌పాతాల మ‌ధ్య న‌లిగిపోతున్న‌ప్పుడు ప్ర‌జ‌లు రోడ్డు మీద‌కి వ‌స్తారు. నిజ‌మైన భావాన్ని, భావ‌జాలాన్ని వ‌దిలి రాజ‌కీయ ప‌రిస్థితులు అదుపు త‌ప్పిన‌ప్పుడు రోడ్డు మీద‌కి వ‌స్తారు.  మేనిఫెస్టోలో పెట్టిన మాట‌లు ప‌ట్టించుకోకుండా, గంట‌కో మాట గ‌డియ‌కో మాట మారుస్తూ ఇష్టం వ‌చ్చిన‌ట్టు చేస్తాం అంటే ప్ర‌జ‌లు చోద్యం చూస్తూ కూర్చోరు. ప్ర‌జ‌లు చొక్కాలు ప‌ట్టుకుని నిల‌దీస్తారు అని చెప్ప‌డానికే క‌వాతు నిర్వ‌హించాం.

దేశం కాని దేశం వ‌చ్చిన కాట‌న్ దొర‌ గుర్రంపై తిరిగి, గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు క్షామంతో అల్లాడిపోతున్న ప‌రిస్థితులు చూసి.  ఉన్న నీరు స‌ముద్రంలోకి పోతుంటే, బ్యారేజీ క‌ట్టి డెల్టాని సస్య‌శ్యామ‌లం చేశారు. అందుకే స‌ర్ ఆర్ధ‌ర్ కాట‌న్‌ని గోదావ‌రి ప్ర‌జ‌లు గుండెల్లో పెట్టుకున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు కూడా అంత బ‌లంగా ఉంటుందో.. లేదో చూడాలి. అంత గొప్ప‌గా ప్రాజెక్టు క‌డితే చంద్ర‌బాబుని కూడా ప్ర‌జ‌లు గుండెల్లో పెట్టుకుంటారు. అయితే ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన అంశం. కాట‌న్ కాంట్రాక్టులు తీసుకోలేదు. బ‌డ్జెట్‌లు పెంచ‌లేదు. కే వీ రావులాగా కాలిఫోర్నియాలో ద్రాక్ష తోట‌లు కొన‌లేదు. ధ‌వ‌ళేశ్వ‌రం లాంటి గ‌ట్టి ప్రాజెక్టు మీద నుంచి తూర్పు గోదావ‌రి జిల్లాలో ప్ర‌వేశించ‌డం. అక్క‌డి నుంచి జిల్లాలోకి ఇంత ఘ‌నంగా స్వాగ‌తం ప‌ల‌క‌డం మ‌ర‌చిపోలేని సంఘ‌ట‌న‌. ధ‌వ‌ళేశ్వ‌రం త‌లివ‌చ్చిన ల‌క్ష‌లాది మందిని, ఆడ‌ప‌డుచుల‌కి అంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాలు. తెలుగు వాణ్ణ‌ని చెప్ప‌డానికే ఈ పంచె క‌ట్టు. మ‌న వ్య‌వ‌స్థ‌, మ‌న జాతి, సంప్ర‌దాయాన్ని కాపాడుకోవాల‌న్న‌దే నా ఉద్దేశం. దేశ స‌మ‌గ్ర‌త‌ని కాపాడుతూనే నా జాతిని నేను గౌర‌వించుకోవాల‌న్న‌దే నా ల‌క్ష్యం. అంద‌రూ చూసే వ్య‌క్తి, అత‌ను పాటిస్తే, ఆ పంచెక‌ట్టుకి గౌర‌వం వ‌స్తుంది. ఉత్త‌రాంధ్ర‌లో త్వ‌ర‌గా ముగించేశారు, గోదావ‌రి జిల్లాలో ఇన్ని రోజులు ఎందుకున్నారు అని అడుగుతున్నారు. నా మూలాలు ఉన్న ప్రాంతం ఇది. వాటిని తెలుసుకోవ‌డానికి, అర్ధం చేసుకోవ‌డానికి, గౌర‌వించుకోవ‌డానికీ నెల రోజుల పాటు ప‌శ్చిమ గోదావ‌రిలో ఉన్నాను. ప్ర‌తి స‌మ‌స్య‌ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నా, అల‌వాటు చేసుకున్నా, మ‌ట్టి శ‌క్తిని, రైతు కూలీల్ని, అన్నింటినీ అర్ధం చేసుకున్నా. గోదావ‌రి జిల్లాల మీద అంద‌రికీ ఒక‌లాంటి ఇష్టం ఉంటుంది. మాకు ఇలాంటి ప్రాంతం లేద‌న్న కోప‌మూ ఉంటుంది. అలాంటి జిల్లాలను అక్వా క‌ల్చ‌ర్‌, ఫుడ్ పార్క్ అంటూ కాలుష్యం కోర‌ల్లోకి నెట్టేస్తున్నారు. గోదావ‌రి జిల్లాల‌కి కొత్త‌గా చేయాల్సింది ఏమీ లేదు. ఉన్నది ఉన్న‌ట్టు కాపాడుకుంటే చాలు. కాట‌న్ స్వ‌ప్నాలు సాకార‌మైన‌ట్టే. మొన్న పోల‌వ‌రం వెళ్తే ప్రాజెక్టు పూర్త‌యితే పాపికొండ‌లు క‌న‌బ‌డ‌వ‌ని చెప్పారు. మ‌నిషి, నాగ‌రిక‌త, అభివృద్ది ముసుగులో ప‌ర్యావ‌ర‌ణాన్ని చంపేస్తున్నాడు. మ‌నం భావిత‌రాల‌కి మంచి ప‌ర్యావ‌ర‌ణం, నీరు ఎలా ఇస్తాం. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌తో పాటు కులాల మ‌ధ్య ఐక్య‌త అవ‌స‌రం. అందుకే నేను ఏ ఒక్క కులాన్నో న‌మ్ముకుని పార్టీ పెట్ట‌లేదు. అన్ని కులాల్ని, మ‌తాల్ని న‌మ్ముకుని వ‌చ్చా. నిన్న మ‌నం చేసింది ఓ యుద్ధం. ఆడ‌ప‌డుచులు, అక్క చెల్లెళ్లు వాడ వాడ‌నా, మూల మూల‌లా న‌లిగిపోయారు. నిన్న మ‌నం చేసింది బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న కాదు. యుద్ధం. జ‌న‌సేన భావ‌జాలం ప‌ట్ల ఆక‌ర్షితులైన జ‌న‌మే ఇక్క‌డికి వ‌చ్చారు. బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తే.. శ‌త్రువు అయినా మిగ‌లాలి, నేన‌న్నా మిగ‌లాలి. భ‌గ‌వంతుణ్ణి న‌మ్మా. ఎవ‌రు ఏమ‌న్నా ప‌డ‌తా. ప‌ట్టించుకోనే. పాప‌పు ప‌నులు చేసేవారు చింత‌కాయ‌ల్లా రాలిపోయే రోజులు వ‌స్తాయి. పాపాలు చేసి గ‌డ్డివాములో దాక్కుంటే పిడుగు ప‌డ‌దా. మ‌న‌కి కావ‌ల్సింది కోట్ల‌నీ కోటేశ్వ‌రుల్ని వెన‌కేసుకొచ్చే ప్ర‌భుత్వాలు కాదు. రోడ్ల మీద తోపుడు బ‌ళ్లు మీద అమ్ముకునే వారిని, స‌రైన తిండిలేక ఇబ్బందులు ప‌డే వారి కోసం ప్ర‌భుత్వాలు కావాలి. సంప‌ద సృష్టించే వారి ప్ర‌భుత్వాలు కావాలి.

ఇన్ఫోసిస్ మూర్తి లాంటి వారు సంస్థ‌లు ఏర్పాటు చేయ‌డానికీ... ఉద్యోగాలు లేకుండా వేల ఎక‌రాలు దోచుకోవ‌డానికి తేడా ఉంది. నేను అభివృద్దికి వ్య‌తిరేకం కాదు. ఉద్యోగులు ఇవ్వ‌కుండా మూడు పంట‌లు పండే భూములు లాగేసుకుని దోచుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోం. ముఖ్య‌మంత్రిగారు ఏరువాక అంటారు. త‌ర్వాత రైతుల క‌ష్టాలు ప‌ట్టించుకోరు. ఆ నాడు స్పెష‌ల్ స్టేట‌స్ కావాలి అంటే ప్యాకేజీ అన్నారు. ఎవ‌రో దానికి చ‌ట్ట‌బ‌ద్ద‌త లేద‌ని చెబితే అనంత వేదిక‌గా ప్ర‌శ్నించా. ముఖ్య‌మంత్రి గారు కేంద్ర మంత్రి మాటే శిరోధార్యం అన్నారు. ఇప్పుడు పార్ల‌మెంటు సాక్షిగా ఇచ్చిన మాట‌లు వెన‌క్కి వెళ్లిపోయాయి. ఇందులో పొలిటిక‌ల్ అకౌంట‌బులిటీ ఎక్క‌డ ఉంది. విశాఖ బాక్సైట్ మైనింగ్ వ్య‌వ‌హారం తీసుకుంటే. అక్క‌డ ఓ అంద‌మైన పెద్ద కొండ నాకు క‌న‌బ‌డుతుంది, ప్ర‌కృతి సౌంద‌ర్యం క‌న‌బ‌డుతుంది. కొంత మందికి మాత్రం డ‌బ్బు మూట‌లు క‌న‌బ‌డుతున్నాయి. వారికి ప‌ర్యావ‌ర‌ణ విలువ‌లు క‌న‌బ‌డ‌వు. అది జాతి సంప‌ద అని గుర్తించరు. ప్ర‌తిప‌క్షంలో ఉంటే ఒక‌లా, అధికారంలో ఉంటే మ‌రోలా మాట్లాడుతారు. ఇందులో జ‌వాబుదారీత‌నం ఎక్క‌డ ఉంది. పార్టీ కార్య‌క‌ర్త‌లంద‌రు పోటీత‌త్వంతో ప‌ని చేయాలి, ఆధిప‌త్యంతో కాదు. రాబోయే నెల రోజుల్లో తూర్పు గోదావ‌రి జిల్లా మూల‌మూల‌కీ వెళ్దాం. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుందాం. ఆ బాధ్య‌త ప్ర‌తి ఒక్కరికీ ఉంది. జిల్లాలో  పితాని బాలకృష్ణకి మిన‌హా ఎవ్వ‌రికీ సీట్లు ఇవ్వ‌లేదు. ఆ నిర్ణ‌యం కూడా నా ఒక్క‌డిది కాదు. అన‌వ‌స‌ర‌పు ప‌నుల‌తో పార్టీని చంపేయకండి. మ‌న‌కి క‌వాల్సింది అధికారం కాదు. మార్పు. అది రావాలంటే ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌త‌గా ఉండాలి. బాధ్య‌త‌తో కూడిన యంత్రాంగం కావాలి. ఇంత అస్థ‌వ్య‌స్థ‌మైన వ్య‌వ‌స్థ‌ని ఊర‌ట క‌లిగించేందుకే నా వంతుగా పార్టీ పెట్టా. పార్టీ పెట్టిన‌ప్పుడు ఐదుగురు కూడా లేరు. కానీ న‌మ్మ‌కం. నేను వ‌స్తే నా వెంట అంతా క‌దులుతార‌న్న న‌మ్మ‌కం. ఆ న‌మ్మ‌కం నిజ‌మైంది. నా ద‌గ్గ‌ర భ‌గ‌వంతుడి ఆశీస్సులు ఉన్నాయి. క‌వాతుకి ల‌క్ష‌లాది మంది వ‌స్తుంటే చూసి ఖిన్నుడినైపోయా. తూర్పు గోదావ‌రి జిల్లాకి జ‌న‌సేన ద్వారా చేయాల్సినవి చేద్దాం. తుపాను భారినప‌డిన శ్రీకాకుళం జిల్లాకి వెళ్లి వ‌చ్చిన అనంత‌రం, ఇక్క‌డ ప‌ర్య‌ట‌న ప్రారంబిస్తాన‌ని శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కి దిశానిర్ధేశం తెలిపారు.

 

 

 

 

SOURCE:JANASENA.ORG

 

16 Oct, 2018 0 411
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved