అంతం చేసేది కేసీఆర్‌ ముక్కుపుడకేనా?
విభాగం: సినిమా వార్తలు
kcr-mukkupudaka_g2d

చాలాకాలంగా తెలుగు రాష్ట్రాల్లోని మీడియాలో ఎన్నికల వార్తలు, పాలకులు అభివృద్ధి, సంక్షేమంపై చెప్పుకునే గొప్పలు, పార్టీల ఆరోపణలు, విమర్శలు....వీటితోనే కాలక్షేపం జరుగుతోంది. పత్రికలు పార్టీల వారీగా పనిచేస్తున్నాయి కాబట్టి ఎవరికి తోచినట్లు వారు మసాల దట్టించి వండివారుస్తున్నారు. భిన్న పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులు కలుసుకుంటే చాలు దానిపై పత్రికల్లో పెద్ద కథనాలు, టీవీల్లో రోజుల తరబడి చర్చలు సాధారణమైపోయాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌ అంటూ గొప్పలు చెప్పుకుంటే, ఆంధ్రా సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ ప్రపంచంలోనే అభివృద్ధిలో దూసుకుపోతోందంటూ వాయించిపడేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్‌ విజయవాడ వెళ్లి దుర్గమ్మకు ముక్కుపడక సమర్పించిన వైనం కూడా మీడియాలో బాగా హైలైట్‌ అయింది. కేసీఆర్‌ తెలంగాణ సరిహద్దు దాటి ఆంధ్రాలో కాలు పెడితేనే గొప్ప వార్త అవుతుంది. ఇక మొక్కు తీర్చుకుంటే దానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే కదా.

కోరుకున్న కోరిక తీరాలని దేవుడికి మొక్కుకోవడం లక్షలాదిమందికి ఉండే సెంటిమెంటు. వారిలో కేసీఆర్‌ ఒకడు. ఇది తెలంగాణ ఉద్యమం జరిగినప్పటి మొక్కు. ప్రత్యేక రాష్ట్రం వస్తే మొక్కులు (నగలు) చెల్లిస్తానని తెలంగాణలోని కొందరు దేవుళ్లతోపాటు ఏపీలోని తిరుమల వెంకన్నకు, విజయవాడ కనకదుర్గకు మొక్కుకున్నారు. మిగతా మొక్కులు ముగిసిపోయినట్లున్నాయి. ఇదొక్కటే మిగిలింది. దీన్ని తీర్చుకోవడానికి నాలుగేళ్లకు పైగా ఎందుకు పట్టిందో తెలియదు.

త్వరలో ఎన్నికలు వస్తున్నాయి (ముందుగా వస్తాయంటున్నారు) కాబట్టి మొక్కు విషయం గుర్తుకువచ్చింది. అది చెల్లించకపోతే ఎన్నికల్లో సీన్‌ రివర్స్‌ అవుతుందనే భయం పట్టుకుందేమో హడావుడిగా ఆ పని పూర్తి చేశారు. కనకదుర్గమ్మ చాలా పవర్‌ఫుల్‌ అని, మొక్కు చెల్లించకపోతే మూడుతుందని భక్తుల విశ్వాసం. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌ ఈ మొక్కులను వ్యక్తిగతంగా మొక్కుకున్నారు. అంటే లెక్క ప్రకారం తన సొంత డబ్బుతో నగలు చేయించి సమర్పించాలి. ఆ స్తోమత కూడా ఉంది. కాని ముఖ్యమంత్రి అయ్యాక కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి వ్యక్తిగత మొక్కులు చెల్లించారు.

ఇది న్యాయమా? ఇది నైతికత? సొంత మొక్కులకు ప్రజాధనం దుర్వినియోగం చేసిన ముఖ్యమంత్రికి పుణ్యం ఎలా వస్తుంది? ఈ అనైతికత భక్తి ఎలా అవుతుంది? ఇది పనికిమాలిన ప్రజాస్వామ్యం  కాబట్టి కేసీఆర్‌ ఆడిందే ఆట. పాడిందే పాట.  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పండుగలు పబ్బాలు, జాతరలు, ఉత్సవాలు తామే మీదేసుకొని స్వయంగా నిర్వహిస్తూ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పండుగల ప్రాశస్త్యం గురించి సీఎంలే స్వయంగా ప్రచారం చేస్తున్నారు. తమ ఇళ్లలో వ్యక్తిగతంగా నిర్వహించుకునే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేస్తున్నారు.

కేసీఆర్‌ భారీఎత్తున చండీయాగం చేశారు.  తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ యాగం చేశానన్నారు. అలాంటప్పుడు ఆ యాగాన్ని ప్రభుత్వ ఖర్చుతో చేసినట్లే కదా. ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేయాలిగాని సర్కారు సొమ్ముతో యాగాలు చేయకూడదు కదా. అలనాడు భక్త రామదాసు ప్రభుత్వ సొమ్ముతో భద్రాచలంలో రాముడి గుడి కడితే రాజు తానీషా జైల్లో పెట్టాడు. కాని ఇప్పటి పాలకులు వాస్తు కోసం, యాగాల కోసం, ఉత్సవాల కోసం ప్రజాధనం ఖర్చు పెడుతున్నా ఎలాంటి శిక్షా ఉండదు.

కేసీఆర్‌ ఖరీదైన ముక్కుపుడకను సమర్పించాక ప్రధాన అర్చకుడు మాట్లాడుతూ ప్రజల సందర్శన కోసం సీఎం ఇచ్చిన ఈ ముక్కుపుడకపు అమ్మవారికి అలంకరిస్తామన్నారు. భవిష్యత్తులో కృష్ణా నది పొంగిపొరలి, అమ్మవారి పుక్కుపుడకను తాకుతుందని, అప్పుడు కలియుగం అంతమవుతుందని వివరించారు. కథ బాగానే ఉందిగాని కృష్ణా నది తాకేది కేసీఆర్‌ సమర్పించిన ముక్కుపుడకనా? మరొకటా? ఇది అనైతిక మొక్కు కాబట్టి కేసీఆర్‌ సమర్పించిన ముక్కపుడక వల్లనే కలియుగం అంతమవుతుందేమో....!

 

SOURCE:GREATANDHRA.COM

30 Jun, 2018 0 340
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved