న్యాయ‌వాదులు రాజ‌కీయాల్లోకి రావాలి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
విభాగం: రాజకీయ వార్తలు
lawyers-should-come-to-politics-says-pawan_g2d


రాజ‌కీయాల‌ను డ‌బ్బుతో ముడిపెట్టేశారని, ఒక ఎమ్మెల్యేగా గెల‌వాలంటే రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్లు ఉండాల‌న్న స్థాయికి తీసుకెళ్లి రాజ‌కీయాలు సామాన్యుడికి అంద‌కుండా చేస్తున్నార‌ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు శ్రీ ప‌వ‌న్ కళ్యాణ్ గారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

ముఖ్య‌మంత్రి కొడుకే ముఖ్య‌మంత్రి అవ్వాలా..? ఒక న్యాయ‌వాది కొడుకు ముఖ్య‌మంత్రి కాకూడ‌దా.?  రైతు కూలీ కొడుకు ముఖ్య‌మంత్రి కాకూడ‌దా..? అని ప్ర‌శ్నించారు.  గురువారం భీమ‌వ‌రం స‌మీపంలోని నిర్మలాదేవి ఫంక్ష‌న్ హాల్ లో న్యాయ‌వాదుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన శ్రీ ప‌వ‌న్ కళ్యాణ్ గారు.. క‌ష్టం తెలియ‌కుండా ముఖ్య‌మంత్రి కొడుకు అనే ఒకే ఒక్క కార‌ణంతో దొడ్డిదారిన మంత్రి కుర్చి ఎక్కి మ‌మ్మ‌ల్ని తొక్కుతానంటే ఎట్లా అని ప్ర‌శ్నించారు. అప్ప‌టి నాయ‌కులు డ‌బ్బు ఉండి, ప‌లుకుబ‌డి ఉండి, జ‌మిందారీ కుటుంబాల నుంచి వ‌చ్చి పోరాటాలు అవ‌స‌రం లేక‌పోయినా సాటి మ‌నుషుల స‌మ‌స్య‌ల కోసం పోరాడి మ‌న‌కు స్వాతంత్య్రం తీసుకువస్తే ఇవాళ రాజ‌కీయాల్లో గూండాలు, బ్రోక‌ర్లు, పైర‌వీకారులు ఎక్కువైపోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి వాళ్ల‌కు న్యాయ‌వాదుల క‌ష్టాలు ఏం తెలుస్తాయని అన్నారు.

డాక్ట‌ర్ అంబేద్క‌ర్ లాంటి మ‌హానుభావుడు రాజ్యాంగం రాశాడు క‌నుక మ‌నం ఈ స్థాయిలో ఉన్నాం…  అదే చంద్ర‌బాబు, జ‌గ‌న్, లోకేష్ రాస్తే మ‌న ప‌రిస్థితి ఏంటని ఎద్దేవా చేశారు. ఎంతోమంది మేధావులు, మ‌హానుభావులు మేధోమథనం చేసి అప్ప‌ట్లో చ‌ట్టాలు చేసేవార‌ని అన్నారు. న్యాయ‌వాదులు నాలుగు గోడల మ‌ధ్య ఉండిపోయి, రాజ‌కీయాల్లోకి రావ‌డం మానేశార‌ని, మీ గొంతును రాజ‌కీయాల్లో బ‌లంగా వినిపించాల‌ని కోరారు. న్యాయ‌వాది వృత్తిలో 80 శాతం మంది బ‌త‌క‌టానికి బాధ‌ప‌డుతున్నారంటే ఆవేద‌న క‌లుగుతుంద‌ని, క‌నీసం మ‌హిళ న్యాయ‌వాదుల‌కు బాత్ రూములు కూడా ఏర్పాటు చేయ‌లేని స్థితిలో ప్ర‌భుత్వం ఉండ‌టం సిగ్గుచేట‌ని అన్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఒక న‌వ‌నిర్మాణ దీక్ష ఆపుకొంటే న్యాయ‌వాదుల స‌మ‌స్య తీరిపోతుంద‌ని అన్నారు. రాజ‌కీయాల్లో వెన్నుపోట్లు, దెబ్బ‌లుంటాయ‌ని తెలుసని, దెబ్బ‌తిన‌టానికి, ఎదురుదాడి చేయ‌డానికే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పారు.  రాజ‌కీయాల్లో బ్రోక‌ర్లు, పైర‌వీకారులే రాజ్య‌మేలుతున్నార‌ని, ఎంత‌ కాలం భ‌య‌ప‌డుతూ వారి అవినీతిని భ‌రిస్తామ‌ని ప్ర‌శ్నించారు. 

హెరిటేజ్ ఫ్యాక్ట‌రీని నిల‌బెట్ట‌డానికి విజ‌య డైరీని చంపేశార‌ని, నాయ‌కుడికి వ్యాపారాలుంటే న్యాయం చేయ‌లేడ‌ని, అందుకే నాకు అవ‌కాశం ఉన్నా వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెట్ట‌లేద‌ని చెప్పారు. స‌రికొత్త సామ్రాజ్యం స్థాపించాలంటే బ‌డుగు, బ‌ల‌హీన, మ‌ధ్య‌త‌ర‌గ‌తి, దిగువ‌స్థాయి మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల్లో రాజ‌కీయ చైత‌న్యం రావాల‌ని అన్నారు. సంప‌ద సృష్టించిన పారిశ్రామికవేత్త‌లు చాలా సింపుల్ గా బ‌తుకుతుంటే.. పైర‌వీలు చేసి కోట్లు సంపాధించిన వారు రూ. 4 కోట్లు విలువ చేసే కార్ల‌లో తిరుగుతూ ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  వ్య‌క్తిగ‌త ల‌బ్ధి కోసం రాజ‌కీయాల‌ను ఉప‌యోగించుకోలేద‌న్నారు. స‌మాజంలో బ‌ల‌మైన మార్పు రావాల‌ని, ఇవ‌న్ని వ‌దిలి త‌ప‌నప‌డుతున్నాన‌ని అన్నారు. న్యాయ‌వాదుల‌కు జ‌న‌సేన పార్టీ అండ‌గా ఉంటుంద‌ని, వారి స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డానికి కృషి చేస్తుంద‌ని చెప్పారు.

 

SOURCE:JANASENAPARTY.ORG

26 Jul, 2018 0 281
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved