99టీవీ మాత్రమే కాదు, త్వరలోనే మరో రెండు చానళ్లు జనసేన చేతికి
విభాగం: సినిమా వార్తలు
not-only-99-tvs,-but-two-other-channels-soon_g2d

ఎప్పటినుంచో జనసేన అభిమానులు సొంత చానల్ కోసం జనసేన పార్టీ అధికార ప్రతినిధులను, కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ ని అడుగుతూనే ఉన్నారు. ఆగస్టు 14న మేనిఫెస్టో విడుదల చేస్తానని పవన్ కళ్యాణ్ గతంలో చెప్పి ఉన్నాడు కాబట్టి ఆ తేదీ కంతా పవన్ కళ్యాణ్ కంటూ సొంత మీడియా ఛానల్ రావచ్చని విశ్లేషిస్తూ గతంలో తెలుగు 360 ఆర్టికల్ రాసిన విషయం కూడా తెలిసిందే (https://www.telugu360.com/will-pawan-kalyan-be-ready-with-channel-by-14th-august/). అయితే మొత్తానికి 99tv ఛానల్ జనసేన నాయకుల చేతిలోకి వెళ్ళిపోయింది. అయితే ఇది ఒకటే కాకుండా మరో రెండు చానళ్లు కూడా రెండు నెలల వ్యవధిలోనే జనసేన వర్గాల చేతిలోకి రానున్నట్టు తెలుస్తోంది .

ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా కొన్ని టీవీ చానెళ్లు తెలివితేటలు ప్రదర్శించి యూట్యూబ్ లైవ్ లో మాత్రమే కవరేజ్ ఇస్తూ టీవీ చానెళ్లలో కవరేజ్ ఇవ్వకుండా చేసిన విషయం తెలిసిందే.(https://www.telugu360.com/te/tv-channels-coverage-on-janasena-nirasana-kavathu/) దాంతో ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా చానల్ లేని లోటు జనసేన అభిమానులకు బాగా తెలిసొచ్చింది. జనసేన నాయకులు కూడా ఉత్తరాంధ్ర పర్యటన కంటే ముందే సొంత టీవీ ఛానల్ ను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

99టీవీ :

సీపీఐ కి సంబంధించిన వారు ప్రారంభించిన ఛానెల్ ఇది. పూర్తిగా మహిళల తో నడిపే ఉద్దేశ్యం తో ప్రారంభించారు. స్టాఫ్ మొత్తం మహిళలే ఉంటారని ప్రారంభించిన మొదట్లో ప్రకటించారు. కానీ అలా కొనసాగించలేక ఆ తర్వాత పురుషులని కూడా స్టాఫ్ గా నియమించుకున్నారు. జనసేన పార్టీ 99 టీవీ 10 టీవీ లతో మంతనాలు జరుపుతున్నట్టు గా వార్తలు వచ్చాయి. అయితే తోట చంద్రశేఖర్ అధికారికంగా 99 టీవీ ని చేజిక్కించుకొని నిన్న పూజా కార్యక్రమాలు కూడా చేశారు. తోట చంద్రశేఖర్ మాజీ ఐఏఎస్ అధికారి ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ తరఫున 2014 లో ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేతలో ఒకరు. హైదరాబాద్ లోని టాప్ 3 కన్స్ట్రక్షన్ కంపెనీలలో ఒకటైన ఆదిత్య కంపెనీ అధినేత కావడంతో డబ్బు మరియు ఇతర వనరుల విషయంలో లోటు అయితే లేని వ్యక్తి ఈయన.

ఏడాది కిందట న్యూ వేవ్స్ అనే మీడియా సంస్థ ని ఒక యూట్యూబ్ ఛానల్ ని ఈయన తరపు వ్యక్తులు ప్రారంభించారు. కేవలం ఏడాది కాలంలోనే దాదాపు ఎనిమిది కోట్ల వ్యూస్ తెచ్చుకుంది. ఈ యూట్యూబ్ ఛానల్. పూర్తిగా జనసేన అనుకూలంగా ఉండే ఈ యూట్యూబ్ ఛానల్ జనసేన పర్యటనలని యూట్యూబ్లో లైవ్ ఇచ్చింది. ఏడాది వ్యవధి లో 8 కోట్ల వ్యూస్ చిన్న విషయమేమీ కాదు. జనసేన అభిమానులు ఛానెల్ కోసం పార్టీ న్యూస్ కోసం ఎంత కసిగా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది.ఇప్పుడు ఈ న్యూ వేవ్స్ మీడియా ఆధ్వర్యంలో కి 99 టీవీ వెళ్లిపోవడంతో దానికి ఆర్థికంగా వనరులు బాగా ఉన్న తోట చంద్రశేఖర్ తోడవడంతో ఈ ఛానల్ రూపురేఖలు పూర్తిగా మార్చివేయడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. వీలైతే ఛానల్ పేరు కూడా మార్చే అవకాశం ఉంది.

10 టీవీ

99 టీవీ సీపీఐ ఆధ్వర్యం లో నడిస్తే 10 టీవీ సీపీఎం ఆధ్వర్యం లో నడిస్తోంది.

ఇక 10 టీవీ చానల్ తో కూడా మంతనాలు పూర్తిగా ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ఈ చానల్ తో మంతనాలు జరుపుతున్నప్పటికి చిరంజీవి వెనకాల ఉండి ఈ వ్యవహారాలను చూసుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి అన్నీ పక్కాగా కుదిరితే ఆగస్టు నెలలోనే ఈ చానల్ కూడా జనసేన కి అనుకూలం గా మారిపోయే అవకాశం ఉంది.

తులసి టీవీ

అలాగే తులసి సీడ్స్ సంస్థ అధినేత తులసి రామచంద్ర ప్రభు దాదాపు ఐదేళ్ల కిందట సొంత ఛానల్ కోసం లైసెన్స్ తెచ్చుకుని ఉన్నాడు ఈయన కూడా ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. అలాగే ఈయన కూడా ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి ఈయన ఆధ్వర్యంలోని న్యూస్ ఛానల్ కూడా సెప్టెంబర్ లోను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్తగా ఛానల్ ప్రారంభించాల్సి ఉండడంతో నియామకాలు ఇతరత్రా ఏర్పాట్లు పూర్తి కావడానికి సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.

ఈ లెక్కన ఎప్పటినుంచో ఛానల్ లేదు అని బాధ పడిపోతున్న మెగా అభిమానులకు అసలు ప్రజారాజ్యం ఓడిపోవడానికి చానల్ లేకపోవడం ప్రధాన కారణం అని భావించే కొంతమంది అభిమానులకు ఒకేసారి మూడు చానెళ్లు ఏర్పాటు చేసి ముందుకు రావడం ద్వారా పవన్ కళ్యాణ్ ఆ అభిమానుల కరువు తీర్చేసినట్టు భావించాల్సి ఉంటుంది.

ఛానళ్ళు రావడంతో సరిపోతుందా ?

అయితే ఛానళ్ళు రావడంతో సరిపోతుందా అంటే కాదనే చెప్పాలి. చానళ్లు ఉన్నంత మాత్రాన అధికారంలోకి రావాలని లేదు. 2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ఛానల్ లేకుండానే అధికారంలోకి రాగలిగాడు. 2014లో జగన్, 2017లో తమిళనాడులో విజయకాంత్ ఛానళ్ళు ఉండి కూడా అధికారంలోకి రాలేకపోయారు. కాబట్టి ఛానళ్ళు ఉన్నంత మాత్రాన అన్ని సమస్యలు తీరిపోయినట్టు భావిస్తే అంతకంటే పొరపాటు ఇంకొకటి ఉండదు. అయితే ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పిన చాలా అంశాలు ప్రజల్లోకి పూర్తిస్థాయిలో వెళ్లలేదు. అభిమానులు ఎలాగో యూట్యూబ్ లో చూసుకుంటారు. కానీ సాధారణ ప్రజలకు చేరాలంటే టీవీ ఛానల్ అవసరం.

అయితే ఇక్కడ ఇంకో చిన్నట్విస్ట్ ఏమిటంటే ఇప్పుడు 99 టీవీ, (ఒకవేళ వస్తే భవిష్యత్తులో10 టీవీ, తులసి టీవీ ) పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వ్యక్తులవి అని తెలిసిపోయాయి కాబట్టి ఆ ఛానల్ లో వచ్చే విశ్లేషణలను ప్రజలు కూడా ఆ కోణంలోనే చూస్తారు. సాక్షిలో ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ప్రజలు “ఇది జగన్ ఛానల్ కాబట్టి అలాగే చెబుతారు లే” అని అనుకున్నట్టు అన్నమాట. కాబట్టి సొంత చానల్ ఉన్నంత మాత్రాన ప్రజల ఒపీనియన్ ‘మౌల్డ్ “ చేయడం కుదరదు. అయితే మిగతా ఛానళ్ళు ప్రసారం చేస్తాయో చేయయో అన్న బాదరబందీ లేకుండా, తమ స్పీచులు, తమ పర్యటనలకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ చానల్ ద్వారా కుదురుతుంది. అలాగే పార్టీ నిర్మాణం, పార్టీలోకి బలమైన నాయకులు తెచ్చుకోవడం లాంటి వ్యవహారాలు సరిగ్గా చేయకపోతే ఛానల్ ఉండికూడా ప్రయోజనం ఉండదు.

మరి ఇప్పుడు చానల్స్ కూడా వచ్చేసాయి కాబట్టి మరి జనసేన మరింతగా దూసుకెళ్తుంది లేదా అనేది చూడాలి

 

SOURCE:TELUGU360.COM

12 Jul, 2018 0 390
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved