శ్రీ కరుణానిధి గారు వేసిన బాటలు చిరస్మరణీయాలు - శ్రీ పవన్ కళ్యాణ్ గారు
విభాగం: రాజకీయ వార్తలు
pawan-condolences-to-karunanidhi_g2d

   
డీఎంకే అధినేత, ద్రవిడ ఉద్యమ తపో పుత్రుడైన కలైజ్ఞర్ శ్రీ కరుణానిధి గారు తుది శ్వాస విడవడం విషాదంలో ముంచింది. ద్రవిడ సంస్కృతి పరిరక్షణకు అహరహం శ్రమించిన శ్రీ కరుణానిధి గారు అనారోగ్య సమస్యల నుంచి కోలుకొంటారని ఆశించాను.

 

కరుణానిధి గారి అస్తమయం కేవలం తమిళనాడుకే కాదు యావత్ దేశానికీ, ముఖ్యంగా దక్షిణ భారతానికి తీరని లోటు. శ్రీ కరుణానిధి గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.  తమిళనాడు రాజకీయాలే కాదు భారత రాజకీయ చిత్రంపై శ్రీ కరుణానిధి గారి ముద్ర బలంగా ఉంది. ద్రవిడ రాజకీయాల్లో మేరునగధీరుడు అనదగ్గ శ్రీ కరుణానిధి గారు అణగారిన, వెనుకబడిన సామాజిక వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయాలు. ద్రవిడ ఉద్యమంలో భాగంగా సాంఘిక దురాచారాలని తెగడిన శ్రీ కరుణానిధి గారు పాలకుడిగా సాంఘిక సంక్షేమానికి కట్టుబడిన విధం ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆదర్శం.

రచనా వ్యాసంగం నుంచి రాజకీయ యవనికపైకి వచ్చినా కలైజ్ఞర్ గానే తమిళుల హృదయాల్లో నిలిచారంటే తమిళ సాహిత్యంపై వారి ప్రభావం ఎంత ఉన్నతమైనదో తెలుస్తుంది. ‘పరాశక్తి’, ‘మనోహర’ తదితర చిత్రాలకు శ్రీ కరుణానిధి గారు అందించిన సంభాషణల గురించి నేటికీ చిత్ర పరిశ్రమలో చెప్పుకోవడం నాకు తెలుసు. రచయితగా, సంస్కృతి పరిరక్షకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, రాజకీయ పార్టీ అధినేతగా, రాష్ట్రాన్ని నడిపించిన ముఖ్యమంత్రిగా శ్రీ కరుణానిధి గారు వేసిన ఉన్నతమైన బాటలు నేటి తరానికీ, భావి తరాలకీ చిరస్మరణీయాలు.

 

 

SOURCE:JANASENA.ORG

08 Aug, 2018 0 277
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved