నేత‌ల్లేరు.. డ‌బ్బులేదు.. రౌడీలు లేర‌న్న ప‌వ‌న్‌
విభాగం: రాజకీయ వార్తలు
pawan-kalyan-about-his-party-comparing-with-jagan_g2d

ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌తానికి భిన్నంగా జ‌గ‌న్ ను ఉద్దేశించి ప‌లు అంశాల్ని ప్ర‌స్తావించారు. త‌న‌కు జ‌గ‌న్ కు పోలిక లేద‌న్న ఆయ‌న‌.. రాజ‌కీయ వ్య‌వ‌స్థ వ్యాపారంగా మారింద‌న్నారు. 

వేల కోట్లు పెట్టుబ‌డులు పెట్టాల్సిన ప‌రిస్థితుల్లో త‌న ద‌గ్గ‌ర కోట్లు లేవ‌ని.. గూండాలు అస‌లే లేర‌న్న ఆయ‌న‌.. తాను సామాన్య కుటుంబం నుంచి వ‌చ్చాన‌ని.. బ‌ల‌మైన రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను తీసుకురావాల‌న్న ఉద్దేశ‌మే త‌న‌కుంద‌న్నారు.

ప‌ద‌వుల కోసం పాకులాడే తీరుత‌న‌కు లేద‌న్న ఆయ‌న‌.. అలాంటి తీరే కానీ త‌న‌కే ఉంటే ప‌ద‌వులు ఎప్పుడో వ‌చ్చి ఉండేవన్నారు. తాను పార్టీ పెట్టే స‌మ‌యానికి సీనియ‌ర్ నాయ‌కులు ఎవ‌రూ త‌న వ‌ద్ద లేర‌ని.. డ‌బ్బు కూడా లేద‌ని.. అయినా త‌న‌పై విమ‌ర్శ‌లు.. వెట‌కారాలు ఎదురైన వైనాన్ని గుర్తు చేశారు. త‌న‌కు ప్ర‌జ‌లే బ‌ల‌మ‌ని.. అదే త‌న న‌మ్మ‌కంగా చెప్పారు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌న‌సేన జెండా రెప‌రెప‌లాడుతుంద‌న్నారు. విప‌క్ష నేత జ‌గ‌న్ త‌న‌ను ముఖ్య‌మంత్రి చేస్తే అన్ని చేస్తాన‌ని చెబుతున్నార‌ని మండిప‌డ్డారు. ఒక కులాన్ని.. మ‌తాన్ని.. ప్రాంతాన్ని న‌మ్ముకొని పార్టీ పెట్ట‌లేద‌న్నారు. స‌మాజంలో రెండే కులాలు ఉన్నాయ‌ని ఒక‌టి దోపిడీ చేసే కుల‌మైతే.. రెండోది దోపిడీకి గుర‌య్యే కులంగా అభిప్రాయ‌ప‌డ్డారు. 

విప‌క్ష నేత జ‌గ‌న్ మాదిరి త‌న‌కు పేప‌ర్ పెట్టే శ‌క్తి లేద‌ని.. త‌న‌కు ఛాన‌ల్స్ అండ కూడా లేద‌న్నారు. అయితే.. ఆడ‌ప‌డుచుల గుండె చ‌ప్పుడు.. వార్తాప‌త్రిక‌లు.. వాట్సాప్ చాన‌ల్స్ ఉన్నాయ‌న్నారు. ఓటు అనే ఆయుధంగా రాజ‌కీయ పార్టీల‌కు బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు. జ‌గ‌న్ పై ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. 

 

 

 

SOURCE:GULTE.COM

11 Oct, 2018 0 407
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved