సమకాలీన రాజకీయాల్లో జవాబుదారీతనం లేదు - శ్రీ పవన్ కళ్యాణ్ గారు
విభాగం: రాజకీయ వార్తలు
pawan-kalyan-about-present-timely-politics_g2d

రాజకీయ జవాబుదారీతనం లేకపోవడం మూలంగా ఆంధ్ర ప్రదేశ్ కు దక్కాల్సిన ప్రత్యేక హోదాపై కేంధ్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మాటలు మార్చారు అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.

పార్లమెంట్ లో చెప్పిన హోదా విషయాన్ని ఎందుకు అమలు చేయలేదో కూడా వివరణ ఇవ్వలేదు అన్నారు. సమకాలీన రాజకీయాల్లో జవాబుదారీతనం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పారు. విజయవాడలోని జనసేన నూతన కార్యాలయంలో శనివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ “రాజధాని అమరావతి ప్రాంతంలో  పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభించడం ఆనందంగా ఉంది. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఉపకరిస్తుందని భావించా. రాష్ట్రానికి హోదా సహా ప్రయోజనాలు, హామీలు నెరవేర్చడంలో తెదేపా విఫలమైంది. బీజేపీ నేతలతో  మాకు ఎక్కడా  బంధుత్వం  లేదు. బీజేపీని నేను ఎప్పుడూ వెనకేసుకు రాలేదు. నేను నా కుటుంబ సభ్యులనే వెనకేసుకు రాలేదు. మోదీని ఎలా వెనకేసుకు వస్తా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అఖిల పక్ష సమావేశం పెట్టాలని రాష్ట్రముఖ్యమంత్రి ని కోరుతున్నా. అందరూ కలసి చర్చించి ఢిల్లీకి వెళ్లి మోదీ ని కలుద్దాం. హోదా కోసం ప్రధాని మోదీపై అంతా కలసి ఒత్తిడి తెద్దాం. అఖిలపక్ష సమావేశం పెడితే జనసేన పార్టీ కలసి వస్తుంది. గతంలో ప్రత్యేక హోదాపై  ప్రభుత్వం పెట్టిన అఖిల పక్ష సమావేశం చిత్తశుద్ధితో పెట్టలేదు. అందుకే గత అఖిలపక్ష సమావేశానికి జనసేన హాజరు కాలేదు. 2014లో సంపాదన వదిలి నేను టీడీపీ, బీజేపీ కి సపోర్ట్ చేసింది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే. హోదా కోసం జనసేన మాదిరి ఎవరూ బలంగా గళం ఎత్తలేదు. సీఎం మాటలు మార్చటం వల్ల ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. హోదా కోసం నేను తొలినుంచీ ఒకేలా మాట్లాడుతున్నాను. సీఎం మాత్రం అప్పుడు హోదాపై మాట్లాడలేదు.  నాయకులు నాలుగుసార్లు నాలుగు రకాలుగా మాట మార్చితే ఎలా ? ప్రజలకు మాటలు చెప్పే ప్రజాప్రతినిధులు ఉన్నారే తప్ప పరిష్కారం చూపించడం లేదు. అందరూ సమష్టిగా పోరాటం చేయాలి, కలిసి రావాలి. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా రాష్ట్రానికి రావాల్సినవాటి గురించి చెప్పాం. ఆ కమిటీ నా ఒక్కడిదే కాదు. జయప్రకాష్ నారాయణ గారు, పద్మనాభయ్యగారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, కృష్ణారావు గారు ఉన్నారు. మేము చెప్పాం.. ఆ నివేదిక ప్రకారం చట్ట సభల్లో ఉన్న టీడీపీ, వైసీపీ ముందుకు వెళ్ళాలి. నేను చట్ట సభల్లో లేను.

ఐటీ దాడులు ఢిల్లీ తరహాలో ఇక్కడి సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం పైనో జరిగి ఉంటే జనసేన ఖండించేది. రాష్ట్రంలోని  పారిశ్రామికవేత్తలు, వ్యాపారాలు చేసే వారిపై అండమాన్ లోనో, గుంటూరులోనో చేస్తే ఏం స్పందిస్తాం. ఈ దాడులు, పరిణామాలపై పార్టీలో చర్చిస్తాం. తెలంగాణ లో 23 లేదా 24 స్థానాల్లో పోటీ చేద్దాం అనుకున్నా. తెలంగాణ లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదు.. కానీ వచ్చాయి. తెలంగాణలో ఎన్నికల్లో పోటీపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. త్వరలో మీడియా సమావేశం ద్వారా వివరాలు తెలియజేస్తాం

సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదు

శ్రీకాకుళం ప్రాంతానికి తుఫాను తాకిడి తగలడం చాలా బాధ కలిగించింది. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితి గురించి తెలుసుకుంటున్నాను. ఆ ప్రాంత వాసులకి మనస్ఫూర్తిగా అండగా నిలుస్తాం. ఇప్పటికే జనసేన శ్రేణులు సహాయ కార్యక్రమాల్లో ఉన్నాయి. పోలీస్, రెవెన్యూ సిబ్బంది రెస్యూ ఆపరేషన్స్ లో ఉంటాయి. ఈ తరుణంలో అక్కడికి వెళ్తే ఆటంకం కలుగుతుందని వెళ్ళడం లేదు. 15న కవాతు పూర్తయ్యాక 16న విశాఖపట్నం చేరుకుంటాను. ఆ తరవాతి రోజు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను కలుసుకుంటాను” అన్నారు.

శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ప్రజా సమస్యలపై పవన్ కల్యాణ్ గారు చేస్తున్న పోరాటం నాకు నచ్చింది.  ఆయన పట్టుదల, చిత్తశుద్ధి పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. ముఖ్యమైన విషయాల్లో ఎక్కడా రాజీపడకుండా ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తాం. రాష్ట్ర ప్రజల కోసం త్యాగాలు చేయటానికి సిద్ధం. తెలుగు ప్రజలకు సేవ చేసే విషయంలో రాజీపడం. ఎక్కడా సమయానుకూల, రాజీపడే రాజకీయాలు చేయం. విజయవాడ కేంద్రంగా మొదలైన పార్టీ కార్యాలయం జన సైనికులకు చేరువగా ఉంటుంది. రాజకీయాల్లో జవాబుదారీతనం రావాలి. ఎందరో త్యాగమూర్తులు, గొప్ప నాయకుల స్ఫూర్తి అవసరం. ఈ 15న నిర్వహించే కవాతులో యువత, మహిళలు ఆ స్ఫూర్తితో పాల్గొని విజయవంతం చేయాలి” అన్నారు. ఈ సమావేశంలో జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ తోట చంద్రశేఖర్, రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్) కన్వీనర్ శ్రీ మాదాసు గంగాధరం, ప్యాక్ సభ్యులు శ్రీ ముత్తా గోపాల కృష్ణ పాల్గొన్నారు.

 

 

 

SOURCE:JANASENA.ORG

 

14 Oct, 2018 0 361
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved