ప్రజ‌ల క‌న్నీరు తుడిచే ప్రభుత్వాన్ని జ‌న‌సేన ఏర్పాటు చేస్తుంది - శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు
విభాగం: రాజకీయ వార్తలు
pawan-kalyan-gives-a-promise-to-arrange-a-government-that-wipes-the-tears-of-people_g2d

పోల‌వ‌రం నిర్వాసితుల కోసం జ‌న‌సేన పార్టీ నుంచి బ‌ల‌మైన ఆలోచ‌నా విధానంతో కూడిన పోరాట క‌మిటీని ఏర్పాటు చేస్తామ‌ని జ‌న‌సేన అధినేత శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు ప్రకటించారు.

బుధ‌వారం ఉదయం పోల‌వ‌రం, ప‌ట్టిసీమ నిర్వాసితులు, డంపింగ్ యార్డ్ బాధితుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. బాధితులు త‌మ గోడుని వెళ్ల‌బోసుకున్నారు. ఈ సంద‌ర్బంగా శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు మాట్లాడుతూ “పోల‌వ‌రం నిర్వాసితులు ఆనందంతో త‌మ భూములు వ‌దిలి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. నిర్వాసితుల క‌ష్టాలు బాధిస్తున్నా, చేయ‌డానికి చేతిలో అధికారం లేదు. ఇప్పుడు నేను చేయ‌గ‌లిగింద‌ల్లా మీ స‌మ‌స్య‌లు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్తా. మీ తరఫున పోరాటం చేస్తా. మీకు అందాల్సిన ప‌రిహారం కోసం  ఎలాంటి పోరాటం చేపట్టినా జ‌న‌సేన పార్టీ అండ‌గా ఉంటుంది. జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌స్తే భార‌త రాజ్యాంగాన్ని, చట్టాన్ని అనుస‌రించి, నిర్వాసితుల‌కి పూర్తి స్థాయి ప‌రిహారం అందేలా చూస్తాం. చ‌ట్టాల అత్రిక‌మ‌ణ జ‌ర‌గ‌కుండా బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తాం. భూమిని ఇచ్చిన రైతుల‌కి ప‌రిహారం ఇవ్వ‌లేని ప‌క్షంలో బాకీకి సంబంధించి హామీ ప‌త్రాలు అంద‌జేస్తాం. ప్ర‌జ‌ల క‌న్నీరు తుడిచే ప్ర‌భుత్వాన్ని జ‌నసేన పార్టీ ఏర్పాటు చేస్తుంది. జాతి ప్ర‌యోజ‌నాల కోసం ల‌క్ష‌ల ఎక‌రాలు వ‌దులుకున్న నిర్వాసితుల గోడు వినే ప‌రిస్థితిలో ప్ర‌భుత్వాలు లేవు. ఎంత చెప్పినా ప్ర‌భుత్వాలు విన‌డం లేదు. నాయ‌కులు ప‌ట్టించుకోవ‌డం లేదు. అందుకే నిర్వాసితుల గోడు అమ‌రావ‌తిలో వినిపిద్దాం. అమ‌రావ‌తి జ‌నాన్ని పోల‌వ‌రం ప్రాజెక్టు చూపేందుకు బ‌స్సులు పెట్టి మ‌రీ ఇక్క‌డికి తీసుకొస్తున్నారు. జ‌న‌సేన పార్టీ పోల‌వ‌రం నిర్వాసితులకి బ‌స్సులు పెట్టి అమ‌రావ‌తికి తీసుకెళ్తుంది. చీఫ్ సెక్ర‌ట‌రీకి విన‌తిప‌త్రం అందిస్తాం. మంత్రులు, ముఖ్య‌మంత్రులు ప‌ట్టించుకోన‌ప్పుడు ఏం చేయాలి. క‌నీసం మీ స‌మ‌స్య‌లు చీఫ్ సెక్ర‌ట‌రీకి, డీజీపీకి తెలియ‌చేద్దాం. లోతుగా స‌మ‌స్య‌ని అధ్య‌య‌నం చేసి బ‌లంగా తెలియ‌చేస్తాన‌న్నారు.

పోల‌వ‌రం నిర్వాసితులు, ప‌ట్టిసీమ బాధితులు, డంపింగ్ యార్డ్ బాధితులు.. మీ అంద‌రి నిస్స‌హాయ‌త చూస్తే బాధ క‌లిగింది. అవినీతి, వివ‌క్ష‌, దోపిడి ఆవేద‌న క‌లిగించాయి. స‌మ‌స్య‌లు చెప్పుకుందామంటే వినే నాధుడు లేడు. 15 ఎక‌రాల భూమున్న ఆసామిని, రెండెక‌రాల‌కి ప‌రిమితం చేశారు. రెండెక‌రాలున్న వారిని స‌ర్వం లేకుండా చేశారు. మాట్లాడితే జాతీయ ప్రాజెక్టు కోసం త్యాగాలు చెయ్య‌మ‌ని అడుగుతారు.. త్యాగాలు చెయ్య‌మ‌నే వారు ఏం త్యాగాలు చేస్తున్నారు. మీ కొడుక్కి దొడ్డిదారిన ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి ప‌ద‌వులు ఇచ్చుకోవ‌డం త‌ప్ప‌. ముఖ్య‌మంత్రి గారికి హైద‌రాబాద్‌లో ఒక ఇల్లు ఉంది. విజ‌య‌వాడ‌లో ఒక ఇల్లుంది. అయినా హైద‌రాబాద్ నుంచి కేసీఆర్ గారు గెంటేస్తే కోపం వ‌చ్చింది. పోల‌వ‌రం నిర్వాసితుల్ని మాత్రం రాత్రికి రాత్రి ఇళ్లు ఖాళీ చేయించి ఎక్క‌డో 85 కిలోమీట‌ర్ల అవ‌త‌లికి గెంటేశారు. అక్క‌డ స‌దుపాయాలు లేవు. వారి బాధ‌లు మీకెందుకు క‌న‌బ‌డ‌వు.?  నిర్వాసితుల త‌రుపున మాట్లాడితే, పోల‌వ‌రం ప్రాజెక్టుని అడ్డుకుంటున్నార‌ని ప్ర‌చారం చేస్తారు. మేం ప్రాజెక్టుని అడ్డుకోవ‌డం లేదు. న్యాయంగా వారికి అందాల్సిన‌ ప‌రిహారం ఇవ్వ‌మ‌ని మాత్ర‌మే డిమాండ్ చేస్తున్నాం. ఇక చెల్లించే ప‌రిహారం వ్య‌వ‌హారంలోనూ ఆశ్రిత ప‌క్ష‌పాతం. అయిన‌వారి కోసం ఏకంగా జీవోలు విడుద‌ల చేసేస్తారు. నిర్వాసిత గ్రామ‌ల త‌ర‌లింపులోనూ అక్ర‌మాలు. లేని వాహ‌నాలు చూపించి కోట్ల రూపాయిలు తినేస్తారు.  ఇవ‌న్నీ చూసినప్పుడు కోపం కట్టలు తెంచుకొంటుంది. అయితే ఆ స్థాయి దాటిపోయింది. ఇప్పుడు బ‌ల‌మైన ఆలోచ‌న చేసే స్థాయికి వ‌చ్చా. అదే బ‌ల‌మైన ఆలోచ‌నా విధానాన్ని మేనిఫెస్టోలో పెడ‌తాన”ని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.

 

 

 

 

SOURCE:JANASENA.ORG

 

11 Oct, 2018 0 394
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved