మహనీయుల త్యాగాలకు సార్థకత కలిగించాలి - శ్రీ పవన్ కళ్యాణ్ గారు...
విభాగం: రాజకీయ వార్తలు
pawan-kalyan-wishing-happy-independence-day_g2d


మన స్వాతంత్య్ర సంబరం ఎందరో మహనీయులు, వీరుల త్యాగాల ఫలం. సమరయోధుల పోరాటపటిమతో మనకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లభించాయి. జీవితాలను తృణప్రాయంగా భావించి తెల్లవారిపై పోరుసల్పిన ఎందరో విప్లవ వీరుల ప్రాణ త్యాగాలు మన స్వాతంత్య్ర పోరాట చరిత్రలోని ప్రతి అధ్యాయంలో కనిపిస్తాయి.

మహనీయుల త్యాగాలకు సార్థకత కలిగించాల్సిన బాధ్యత భారతీయులందరిపైనా ఉంది. శాసనకర్తల స్థానాల్లో ఉన్నవారు- కొద్దిమంది క్షేమం కోసం కాదు సువిశాల భారతాన్ని మదిలో ఉంచుకొని కోట్లమంది ప్రజల ప్రయోజనాలను కాపాడాలి. అందుకు భిన్నంగా వర్తమానం ఉంది. ఏడు దశాబ్దాలుపైబడిన మన స్వతంత్ర భారతంలో అభివృద్ధి ఫ‌లాలు అతి కొద్ది మందికే  అందుతున్నాయి. ఆర్థికంగా బ‌ల‌మైన వారు మ‌రింత బలపడుతుంటే..పేదవారు మరింత పేదలుగా మారడాన్ని అభివృద్ధి అనగలమా?  కుల‌, మ‌త‌, ప్రాంత వివ‌క్ష‌ల‌తో కునారిల్లే పరిస్థితులు సమాజానికి శ్రేయస్కరం కాదు. 

గాంధీజీ, భగత్ సింగ్, ఆజాద్, అంబేద్కర్, ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు లాంటి మహనీయులు అందించిన స్ఫూర్తిని మనందరం నరనరాన నింపుకోవాలి. పాలకుల కుటుంబాలు మాత్రమే వెలుగొందితే ప్రజాస్వామ్యం అనిపించుకోదు. మా కుటుంబం, మావాళ్లు అనే కుత్సిత ధోరణితో పాలన చేసేవారి నుంచి మనం విముక్తం కావాలి. అప్పుడే అట్టడుగు స్థాయి వరకూ సంక్షేమ ఫలాలు అందించగలం. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఇది మనందరి ఆకాంక్ష కావాలి. 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నా తరఫున, జనసేన పార్టీ తరఫున దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.

 

 

SOURCE:JANASENA.ORG

15 Aug, 2018 0 357
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved