పవన్ చతికిల.. పార్టీ విలవిల
విభాగం: రాజకీయ వార్తలు
pawan-keeps-calm-janasena-in-backlag_g2d

జనసేనే అధినేత పవన్ కల్యాణ్ జనంలోకి వచ్చినప్పుడు పిడికిలి బిగించి మరీ పెద్దపెద్ద డైలాగులు చెబుతుంటారు. అదిచేద్దాం.. ఇది చేద్దాం.. రాజ్యం మనదే, రాజు నేనే అంటూ ఏవేవో చెబుతుంటారు. మళ్లీ సడన్‌గా మాయమైపోతుంటారు. ఇదీ.. ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. గత కొద్దికాలంగా బాగా యాక్టివేట్ కావడంతో ఆ ఆరోపణ తగ్గింది. 

కానీ, మళ్లీ పవన్ గ్యాప్ తీసుకోవడంతో మరోసారి ఆయన చతికిలపడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో పట్టుదల ఒకటి.. అది పవన్‌లో మచ్చుకైనా కనిపించడం లేదన్నది విశ్లేషకుల మాట. నాల్రోజులు జనంలోకి వెళ్లే నెల రోజులు రెస్ట్ తీసుకుంటున్న పవన్ ఇక పార్టీ శ్రేణులకు ఏం భరోసా ఇస్తారన్న ప్రశ్న వినిపిస్తోంది.

మరోవైపు పవన్ జనసేనకు ఏ నియోజకవర్గంలోనూ సరైన ఫేసంటూ లేదు. అక్కడి నాయకులు, కార్యకర్తలకు ఒకరిని ప్రతినిధిగా నియమించలేదు. దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. పైగా... అధికార టీడీపీ పవన్ పార్టీలో తిరుగుతున్నవారిని టార్గెట్ చేయడంతోవారంతా ఇబ్బందులు పడుతున్నారు. 

టీడీపీ అధికారంలో ఉండడంతో జనసేన వారు కట్టే ఫ్లెక్సీలు తీయించడం.. వారిని అడ్డుకోవడం వంటివి పలుచోట్ల జరుగుతున్నాయి. కానీ.. వీటిపై ఆయా నియోజకవర్గాల్లో ఎవరో ఒకరు వెళ్లి పోలీసులను కలవడమో.. పవన్‌కు చెప్పడమో వంటివి జరగడం లేదు. కారణం... బాధ్యులంటూ లేకపోవడమే. దీంతో పార్టీకి అంతంతమాత్రంగా ఉన్న శ్రేణులు కూడా విసుక్కుంటున్నారట.

అయితే.. పవన్ పార్టీలోని కొందరు ముఖ్యులు మాత్రం దీనికి వేరే కారణాలు చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలా అని పవన్ ఆలోచిస్తున్నారని ఒకరు చెప్తుంటే.. ఏపీ ఎన్నికల్లో 175 స్థానాలు గెలవడంపై పవన్ ప్లాను గీస్తున్నారని మరొకరు అంటున్నారు. పవన్‌ను విమర్శించేవారు మాత్రం చేతిలో ఉన్న పైసలైపోయాయి పార్టీ ఎలా నడపాలా అని కూర్చుని ఆలోచిస్తున్నాడనిఅంటున్నారు.

 

 

SOURCE:GULTE.COM

11 Sep, 2018 0 341
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved