అన్నీ ల్యాప్ టాప్ లో తెలుసుకొనే సీఎం గారికి తిత్లీ తుపాన్ గురించి తెలియదా? - జనసేనాని
విభాగం: రాజకీయ వార్తలు
pawan-questions-babu-over-titli-cyclone_g2d

 'లక్షలాది కొబ్బరి, జీడి మామిడి చెట్లు నేలకూలాయి... ఈ కష్ట కాలంలో రైతన్నలు ఎవరూ అధైర్యపడవద్దు. మనకున్న భూమిని వదిలిపెట్టవద్దు' అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాన్ మిగిల్చిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ఈ ప్రాంతాల రైతులందరికీ సంపూర్ణ రుణ మాఫీ చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పార్టీ పక్షాన పోరాటం చేస్తామని ప్రకటించారు. వజ్రపు కొత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించి బాధితులను పరామర్శించారు. వారి కష్టాలను, నష్టాలను అడిగి తెలుసుకున్నారు. అక్కుపల్లి గ్రామంలో బాధితులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ "ఈ ప్రాంతం పచ్చగా ఉండేది. ఇప్పుడు ఎటు చూసినా నేలకొరిగిన చెట్లే కనిపిస్తున్నాయి. అక్కడక్కడా కొబ్బరి చెట్టు నిలబడి ఉన్నా మొవ్వు విరిగి ఉన్నాయి. ఈ నష్టానికి చెట్టుకి రూ.12 వందలో, రూ.15 వందలో ఇస్తే సరిపోదు. టీడీపీ ప్రభుత్వం తిత్లీ ప్రభావిత ప్రాంత రైతులకు పూర్తిగా రుణాలు మాఫీ చేయాలి. కొబ్బరి, జీడి మామిడి రైతులకి ఫల సాయం చేతికి వచ్చేందుకు కనీసం పదేళ్లు పడుతుంది. అప్పటి వరకూ ఏటా ఆర్ధిక భరోసా కల్పించాలి. బాధితులను కలిసి, ఇక్కడి నష్టాల్ని చూస్తున్నాను... వీటి గురించి  ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి తెలియచేస్తాను. 1999 లో వచ్చిన తుపాన్ వల్ల కలిగిని నష్టంతో చాలామంది వలసలు వెళ్లిపోయారు. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదు. ఈ భూములు ఇక పనికిరావు అంటూ కొనుగోళ్ల కోసం రాబందుల్లా వాలిపోతున్నారు. మీరు అధైర్యపడి అమ్ముకోవద్దు. భూమిని నమ్ముకోండి. మన సంపద మనమే సృష్టించుకుందాం. తిత్లీ తుపాన్ విషయంలో ముందుగా ప్రజలని అప్రమత్తం చేసి, హెచ్చరికలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎప్పుడో ల్యాప్ టాప్ గురించి చెబుతూ... తన ల్యాప్ టాప్ లో అన్నీ ముందుగానే తెలిసిపోతాయని చెప్పే సీఎం గారు ఈ తుపాన్ గురించి ముందుగా తెలుసుకోలేకపోయారా? ఆయన రబ్బరు బోట్లలో తిరుగుతూ ఫోటోలు దిగుతున్నారు. సరైన రీతిలో ముందే అప్రమత్తం అయి, ప్రజలని హెచ్చరించాలి. అలా చేయలేదు. ముందుగా సిద్ధం అయి ఉంటే యంత్రాంగం  కనీసం మూడునాలుగు రోజులకి సరిపడా సహాయ సామాగ్రిని సిద్ధం చేసుకొని ఉండేవారు. ప్రజలకి మాత్రం ఇప్పటి వరకూ విద్యుత్ రాక చీకట్లో ఉన్నారు. పొరుగున ఒరిస్సాలో విద్యుత్ పునరుద్ధరణ చేశారు. ఇక్కడ మాత్రం ప్రజలు కష్టాల్లో ఉన్నారు. సీఎం గారు మాత్రం పవన్ కళ్యాణ్, కేసీఆర్, మోడీ, జగన్ కలిసి తనను కష్టపెడుతున్నారని చెబుతున్నారు. నిజంగా కష్టాల్లో ఉన్నది ప్రజలే అని గుర్తించండి. నేను ఒడ్డున ఉండి రాళ్లు వేస్తున్నాను అని అంటున్నారు. నాకేం పని.... మీకు మద్దతు ఇచ్చి గెలిపించినవాడిని. తప్పులు చేస్తున్నా, ప్రజలు కష్టాల్లో ఉన్నా వాటిని బలంగా చెబుతాను. ఇక్కడి మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు గార్లు ఏం చేస్తున్నారు? ఇక్కడి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా వారికి పట్టడం లేదు. కళా వెంకట్రావు గారు విద్యుత్  శాఖ మంత్రి అయినా ఈ ప్రాంత ప్రజలకి మాత్రం ఇంకా కరెంటు రాలేదు. కౌలు రైతులను ఆదుకొనేందుకు అన్ని చర్యలూ తీసుకుంటాం. 

సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రమిది. ఏ తుపాను వచ్చినా ముందుగా దెబ్బ తినేది మత్స్యకారుల జీవితాలే. వారిని అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తిత్లీ దెబ్బకు మర పడవలు, తెప్పలు, వలలు నాశనమైపోయాయి. వారి జీవనోపాధికి నష్టం కలిగింది. వీరికి అవసరమైన శాశ్వత పరిష్కారం చూపించాలి. వీరి ఉపాధికి అవసరమైన చర్యలు చేపట్టడంతోపాటు కోల్డ్ స్టోరేజి సదుపాయాలూ తీసుకు రావాలి. ఈ ప్రాంతాల్లో తుపాను షెల్టర్లు దుమ్ముపట్టిపోయాయి. కనీసం వాటిని బాధితులు ఉపయోగించుకొనే పరిస్థితి లేదు. 

వాళ్లే మన దగ్గరకి రావాలి 

పాతిక కేజీల బియ్యం, కాసింత నూనె, కేజీ బంగాళా దుంపలు ఇచ్చి ఇదే సాయం అంటే సరిపోదు. ఇక్కడ పాతికేళ్ల జీవితాలు పోయాయి. ఇక్కడివారికి పాతికేళ్ల భవిష్యత్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారిని అన్ని విధాలా నిలబెట్టేలా చేయాలి. కొబ్బరి, జీడి మామిడి పంటలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. ఇక్కడ వాటికి సంబంధించిన బోర్డులు పెట్టి, అనుబంధ పరిశ్రమలు తెచ్చి రైతుల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి. అప్పుడు అచ్చెన్నాయుడు ఇంట్లో చింతపండు అయిపోయినా, రామ్మోహన్ నాయుడు ఇంట్లో చక్కర అయిపోయినా మన దగ్గరకి రావాలి. మంత్రులు మన దగ్గరకి వచ్చే విధంగా ఎదగాలి. 

ప్రజల్ని బుల్డోజర్లతో తొక్కిస్తారా..? అదేం పద్దతి?

పాతికేళ్ల జీవితాలు పోగొట్టుకొని, అన్ని విధాలా నష్టపోయి బాధల్లో ఉన్నవారు ప్రజా ప్రతినిధుల్ని, నాయకుల్ని కాక ఇంకెవరిని అడుగుతారు. అడిగినవాళ్ళని బుల్డోజర్లతో తొక్కిస్తామని ముఖ్యమంత్రి అనడం ఏమిటి. అదేం పధ్ధతి. మీ అబ్బాయి లోకేష్ 'సీఎంని చేయి... సీఎంని చేయి' అని అడుగుతుంటే సముదాయిస్తున్నారు కదా... ప్రజల్ని సముదాయించి, వారికి కావాల్సిన సాయం చేయలేరా. అరెస్టులు చేయించడం, భయపెట్టడం, రేషన్ కార్డులు తీసేస్తామని బెదిరించడం సరి కాదు. అలా చేసే నాయకులకి ఒకటే చెప్పండి 'మీరు అస్తమిస్తున్న సూర్యులు... మేం ఉదయించే సూర్యులం' అని. తుపాన్ ప్రాంతాల్లో తిరిగి అన్నీ చేసేశాం అని సీఎం చెబుతున్నారు. ఇప్పటికీ కరెంట్ లేదు. సీఎం గారు ఏం మ్యాజిక్ చేశారోగానీ- గవర్నర్ గారు కూడా సహాయ కార్యక్రమాలు బాగా చేశారు అని మెచ్చుకుంటున్నారు. సీఎం గారికీ, గవర్నర్ గారికీ పడదు అంటారు. ఆయనతోనే పొగిడించుకున్నారు మన సీఎం గారు. ఇక ప్రతిపక్ష నేత ఇక్కడ శ్రీకాకుళం ప్రజలు తుపాన్ తో అన్ని విధాలా బాధల్లో ఉంటే ఇటు వైపు రావడం లేదు. ఆయన పక్క జిల్లాలో యాత్రలు చేస్తున్నారు. పాలకులకి శ్రీకాకుళం అంటే చిన్న చూపు. ఇక్కడి కష్టం, నష్టం బయటకి సరిగా చెప్పడం లేదు. మనం ప్రపంచం దృష్టికి తీసుకువెళదాం. పారిశ్రామికవేత్తలు ఒక్కొక్కరూ ఒక్కో ఊరిని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలి. రామ్ చరణ్ కి కూడా చెబుతా ఒక ఊరిని దత్తత తీసుకోమని. జనసేన పార్టీ ఎప్పుడూ ఈ ప్రాంతానికి అండగా నిలుస్తుంది" అన్నారు.

జనసేన నాయకులు శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ "శ్రీకాకుళం జిల్లా తిత్లీ తుపాన్ తో తీవ్రంగా నష్టపోయింది. జనసైనికులు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన ఉన్నారు. ఈ ప్రాంతం పూర్తిగా కోలుకొనేవరకూ జనసేన చేదోడువాదోడుగా ఉంటుంది. ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. అవసరమైతే ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని నిలదీయాలి. మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ప్రాంతానికి జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేయాలో జనసేన వైపు నుంచి తగిన విధానాలు రూపొందిస్తాం. ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండగా నిలుస్తారు" అన్నారు.

 

 

 

 

SOURCE:JANASENA.ORG

 

20 Oct, 2018 0 308
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved