రిజర్వేషన్ అంశంపై కూలంకషంగా అధ్యయనానికి నిపుణులతో చర్చలు - శ్రీ పవన్ కళ్యాణ్
విభాగం: రాజకీయ వార్తలు
pawan-with-experts-on-reservation-issue_g2d

జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మొదటిసారి మంగళవారం హైదరాబాద్ లో సమావేశమైంది. మాదాపూర్ లో ఉన్న కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి  సాయంత్రం 5 గంటల వరకూ విస్తృత సమావేశం నిర్వహించారు. 

ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ నిర్మాణంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన సమస్యలపై ఈ కమిటీ చర్చించింది. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధక్ష్యతన సాగిన ఈ సమావేశంలో రిజర్వేషన్ల అంశంపై చర్చించారు. రిజర్వేషన్ల విషయాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాలే  పరమావధిగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వాడుకొంటున్నాయని పొలిటికల్ అఫైర్స్ కమిటీ అభిప్రాయపడింది. నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే ముఖ్యమంత్రి కూడా కులాల మధ్య చిచ్చు రేపే విధంగా రిజర్వేషన్ల విషయంలో వ్యవహరించడం, ఈ విషయంపై ప్రతిపక్ష నేత ఏడాదికో మాట మార్చడం చూస్తుంటే.. రాజకీయ లబ్ధిని దృష్టిలో ఉంచుకొనే  ఆ పార్టీలు రాజకీయ క్రీడలు ఆడటం కాక  మరేమవుతుందని కమిటీ వ్యాఖ్యానించింది.

నాలుగు దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్, రెండు దశాబ్దాలు పీఠం మీద ఉన్న తెలుగుదేశం పార్టీలకు రిజర్వేషన్లపై  నిశ్చితాభిప్రాయం లేకుండా ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ  గందరగోళంతో, కులాల మధ్య దూరాలు పెంచి ప్రయోజనాన్ని పొందే పనిలో  అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయన్నారు.. ఈ అంశంపై కూలంకషంగా అధ్యయనం చేసేందుకు నిపుణులతో చర్చించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. అర్హులైన వర్గాలన్నింటికీ రాజకీయ ఫలాలు అందాలని చెప్పారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయడం బాధ్యతారాహిత్యమే అవుతుందనీ, అధికార ప్రతిపక్షాలు ఆ పనిలోనే ఉన్నాయన్నారు.

రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఆచరణాత్మక విధివిధానాలతో కూడిన నిర్ణయాలు అవసరమని చెప్పారు. పాలకులు ఈ విషయంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లోని లోపాల మూలంగా ప్రజల మధ్య అంతరాలు పెరిగే పరిస్థితులు వచ్చాయన్నారు.రాబోయే రోజుల్లో న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులు, వివిధ వర్గాల మేధావులు, ప్రతినిధులతో ఇందుకు సంబంధించిన చర్చ చేసి పార్టీ అభిప్రాయం వెల్లడించనున్నారు. రిజర్వేషన్ల లక్ష్యం, ఉద్దేశాలు, వాటి అమలులో పాలక వర్గాలు అనుసరించిన విధానాలు, లోపభూయిష్టమైన నిర్ణయాలు, రాజ్యాంగ, చట్టబద్ధంగా అమలు చేయడం, ఇరుగుపొరుగు రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్దతులపై చర్చిస్తారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కమిటీ కన్వీనర్ శ్రీ మాదాసు గంగాధరం, కమిటీ సభ్యులు శ్రీ తోట చంద్రశేఖర్, శ్రీ మారిశెట్టి రాఘవయ్య, శ్రీ అర్హం యూసుఫ్, పార్టీ రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరిప్రసాద్ పాల్గొన్నారు.

అనంతరం పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. పార్టీపరంగా జిల్లాల్లో చేపడుతున్న కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు ప్రక్రియ, వీర మహిళ, ఆజాద్ యూత్ విభాగాల నిర్మాణంపై చర్చించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశా నిర్దేశం చేశారు. జనసేన మేనిఫెస్టో రూపకల్పన, విద్యార్ధి విభాగానికి సంబంధించిన చర్చను బుధవారం నిర్వహిస్తారు. ప్రత్యేక హోదా సాధన, భూసేకరణ చట్టం పరిరక్షణ అంశాలపైనా చర్చిస్తారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు శ్రీ మహేందర్ రెడ్డి, శ్రీ శంకర్ గౌడ్, శ్రీ ఎ.వి.రత్నం, శ్రీ పార్థసారథి, శ్రీ ఎం.కృష్ణారావు, శ్రీ బొమ్మదేవర శ్రీధర్, శ్రీ అద్దేపల్లి శ్రీధర్, శ్రీ పి.విజయబాబు తదితరులు పాల్గొన్నారు.

 

 

SOURCE:JANASENA.ORG 

01 Aug, 2018 0 372
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved