ఉపాధ్యాయుల గౌరవం పెంచేలా జనసేన చూస్తుంది - శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
విభాగం: రాజకీయ వార్తలు
pawankalyan-about-teachers-respect_g2d

నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్కూల్ లో నేర్చుకున్న పాఠాలే తనను ఈ విధంగా నిలబెట్టాయని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ స్కూల్లో విద్యా బోధన చేసిన నా గురుదేవులు పాఠాలే కాకుండా విలువలను కూడా నేర్పించారని తెలిపారు.

నెల్లూరులోని డి.ఎస్.ఆర్. జస్టిన్ లో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను, చిన్ననాటి మిత్రులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పాదాభివందనం చేసి సత్కరించారు. మిత్రులు సతీష్, నిరంజన్, సమీర్, రామకృష్ణ తదితరులను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. “నెల్లూరులోనే నా పాఠశాల రోజులు గడిచాయి. రొట్టెల పండగ సమయంలో నాకు చదువు చెప్పిన టీచర్లను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సెయింట్ జోసెఫ్ స్కూల్లో నేర్పిన దేశభక్తి గీతం నాకు స్ఫూర్తి కలిగించింది. అక్కడ నేర్పిన పాఠాలు నన్ను నిలబెట్టాయి. నేను రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్లలేకపోయేవాణ్ణి... కారణం నాకు ఆస్తమా ఉండేది. గీతా టీచర్ స్టోరీ టెల్లింగ్ క్లాసెస్ చాలా ఆసక్తిగా ఉండేవి. విజయ లక్ష్మి టీచర్ చెప్పిన మంచి మాటలు ఇప్పటికీ గుర్తే. ఇక్కడ నాకు మంచి మిత్రులు ఉన్నారు. జనసేన పార్టీ ఉపాధ్యాయుల గౌరవం పెంచేలా చూస్తుంది. ఉపాధ్యాయులు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా చేస్తుంది. ఇందుకోసం మా పార్టీ మేనిఫెస్టోలో తగిన ప్రణాళిక ఇస్తాం. వారికి గతంతో పోలిస్తే తక్కువ న్యాయం జరుగుతోంది. వారు సంఘంలో అన్ని విధాలా గౌరవం పొందాలి. బోధన రంగం అన్నిటికంటే గొప్పదిగా నిలుపుతాను. ఒక సమస్యపై కూలంకషంగా పరిశీలన చేయడం, అందుకు సంబంధించి అధ్యయనం చేయడం లాంటివి నాకు మా టీచర్లు చెప్పిన పాఠాల ద్వారానే అలవడింది. ఉచిత విద్య అమలుకు అన్ని విధాలా కృషి చేస్తాను” అన్నారు. 

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు బోధించిన శ్రీమతి కనకదుర్గ గారు మాట్లాడుతూ “అప్పట్లో పవన్ కళ్యాణ్ కి తెలుగు కష్టంగా ఉండేది.. ఎందుకంటే ఇంగ్లిష్ మీడియమ్ విద్యార్థి. కష్టపడి నేర్చుకున్నాడు. నా దగ్గర చదువుకున్న విద్యార్థి మనందరి కోసం పార్టీ స్థాపించాడు. పవన్ కి అంతా మంచే జరగాలి” అని ఆకాంక్షించారు. ఇంగ్లిష్ పాఠాలు చెప్పిన శ్రీమతి విజయ గారు మాట్లాడుతూ “8, 9, 10 తరగతుల్లో ఇంగ్లిష్ చెప్పాను. చాలా బుద్ధిగా వినేవాడు. గొప్ప స్థాయికి ఎదిగినా ఎంతో ఒదిగి ఉన్నాడు. బైబిల్ లో చెప్పిన వాక్యాన్ని ఇంకా గుర్తుపెట్టుకొని చెప్పడం సంతోషంగా ఉంది” అన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ కమలాకర్ గారు మాట్లాడుతూ “పవన్ ఎంతో క్రమశిక్షణ కలిగిన విద్యార్థి. ఆ క్రమశిక్షణతోనే ఈ స్థాయికి ఎదిగాడు. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే కృషి ఉండాలని పవన్ ద్వారా తెలుస్తుంది” అని చెప్పారు. 

యువత ఓట్లను తొలగించేశారు 

నెల్లూరులో జనసేన శ్రేణులు, నాయకులు కలిసినప్పుడు పలు అంశాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం 21 లక్షల మంది యువ ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. మన దేశం బాగుపడాలి అని అందరూ కోరుకోవాలి. అందుకు ఓటరుగా నమోదు కావడం తప్పనిసరి. ప్రజా సమస్యలపై పార్టీ తరఫున అందరూ పోరాడాలి. లీడర్ షిప్ అంటే జండా పట్టుకువెళ్లడం కాదు... ప్రతి ఒక్కరూ మరికొంతమందిని ప్రభావితం చేయాలి. పార్టీ కోసం పని చేయాలి. మనం చేసిన పోరాటాలు, మంచిని అందరికీ చెప్పాలి. రాజకీయ పార్టీలో ఎవరూ రమ్మని బొట్టుపెట్టి పిలవరు. ఎవరికివారు నిస్వార్థంగా రావాలి. ప్రతి ఒక్కరూ ఇది నా పార్టీ అనుకొని బాధ్యతతో పనిచేయాలి. అలా చేసేవారందరి పని నాకు గుర్తుంటుంది. అందరూ ఐక్యంగా పనిచేయాలే తప్ప నేను మాత్రమే ఎదుగుతా అనుకొంటే కుదరదు. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా అక్కడ పేదరిక పరిస్థితులు కళ్ళకు కడతాయి. చాలా బాధ కలుగుతుంది. వాళ్ళు గొప్పగొప్ప ఉద్యోగాలు అడగటం లేదు. తాగడానికి మంచి నీళ్ళు కావాలి అంటున్నారు. తెలంగాణ, ఆంధ్ర విడిపోవడం బాధాకరం. ఏదీ ముందు జాగ్రత్త లేకుండా విడదీశారు. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా సాగాలి” అన్నారు.

 

 

 

 

SOURCE:JANASENA.ORG

23 Sep, 2018 0 367
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved