సుపరిపాలన, ప్రజాపాలన లేనప్పుడు ఖచ్చితంగా బలంగా మేము మాట్లాడతాము - జనసేనాని..
విభాగం: రాజకీయ వార్తలు
pawankalyan-speech-in-kovvuru-meeting_g2d

కొవ్వూరు బహిరంగ సభలో జనసేనాని ప్రసంగం :

* ఇక్కడికి వచ్చిన ఆడపడుచులకు, అన్నదమ్ములకు, భవానీ మాత భక్తులకు పేరు పేరునా నా హృదయపూర్వక నమస్కారములు. ఎంతో ప్రేమతో ఘన స్వాగతం పలికిన పెద్దలకు, యువతకు వందనాలు.

* జనసేన పార్టీ పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కోసం అని అక్కడక్కడా చూస్తాం...ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఒక భాగం, అంతే గాని అధికారానికి దూరంగా ఉంటామని కాదు.

* ముఖ్యమంత్రి గారిని కూర్చోపెట్టినట్టు వాళ్ళ అబ్బాయిని లేక ఇతరులను కూర్చోపెట్టడానికి కాదు జనసేన పార్టీ పెట్టింది..బాధ్యత, అనుభవం వున్న నాయకుడు కావాలని 2014లో తెలుగుదేశానికి మద్దతు తెలిపాను.

* సుపరిపాలన, ప్రజాపాలన లేనప్పుడు ఖచ్చితంగా బలంగా మేము మాట్లాడతాము. కొవ్వూరు దగ్గరకి వచ్చేటప్పటికి అన్ని ప్రాంతాల్లో.. నియోజకవర్గాల్లో సమస్యలు మాట్లాడం వేరే విధంగా ఉంటుంది, ఇక్కడ వేరేగా ఉంటుంది. కొవ్వూరు ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం, తప్పు ఒప్పులు జరిగినా గాని నేను మాట్లాడితే వేరే విధంగా ఆలోచిస్తారు.  

* కొవ్వూరు నియోజకవర్గ సమస్యలు మాట్లాడేముందు నేను కులాల గురించి మాట్లాడాలి. ప్రతీ ఒక్కరు ఏదొక కులంలో పుట్టాలి, మనం కోరుకుంటే కులంలో పుట్టలేదు...భారతదేశంలో కులాలు అన్ని వృత్తి ఆధారంగా పుట్టినవి. రాను రాను కులాల మధ్య అసమానతలు పెరిగాయి...దశాబ్దాల పాటు ఆలోచించి కులాల ఐక్యత అని జనసేన సిద్ధాంతాలలో పెట్టాను.

* నేను ఏ మంత్రినైనా లేక ఇతర నాయకులను తిట్టినపుడు నన్ను ముఖ్యమంత్రి గారు తిట్టరు, నేను వచ్చిన కులంకు సంబంధించిన గంటా గారినో.. లేక కళా వెంకట్రావు గారి చేతో తిట్టిస్తారు లేక ఆ ప్రాంత పరిస్థితులుకి అనుగుణంగా కొంతమంది చేత తిట్టిస్తారు..అలా నన్ను తిట్టే వ్యక్తులలో మంత్రి జవహర్ గారు ఒకరు. 

* ముఖ్యమంత్రి గారు గాని, లోకేష్ గారు గాని, దేవినేని గారు గాని తిట్టొచ్చుగా కానీ వాళ్ళు జవహర్ గారిచేత తిట్టిస్తారు. నేను జవహర్ గారిని ఏమైనా అంటే నువ్వు ఎస్సీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని అనడానికా? కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారా? 

* నేను ఎవరినైనా కులాలతో చూడను, ప్రజాప్రతినిధులుగా మాత్రమే చూస్తాను. కాపు కులస్థులు గాని, బీసీ లు గాని, వెలమలు గాని, కమ్మ లు గాని, రెడ్డిలు గాని మీరు ఏ కులమైనా మీరు రాజ్యాంగం ప్రకారమే ప్రజాప్రతినిధులు అయ్యారు.

* ఉత్తరాంధ్ర వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు కుటుంబాలు బాగుపడుతున్నాయి గాని కులాలు బాగుపడట్లేదు అని నాతో చెప్పారు.

* జవహర్ గారి లాంటి గురువులను చూస్తే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వరః అని అంటాం..మొన్న నెల్లూరు వెళ్ళినప్పుడు కూడా నా టీచర్లకు పాదాభివందనం చేసాను, నాకు టీచర్లంటే చాలా ఇష్టం, భక్తి..

* ఉపాధ్యాయ వృత్తి నుండి వచ్చిన జవహర్ గారు ప్రజలను బీరు తాగండి, బీరు తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోదు అని చెప్తున్నారు. 

* తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపమని కంభంపాటి రామ్మోహన్ రావు గారు, వారి అబ్బాయిలు, వారి స్నేహితులు నా దగ్గరకి వచ్చి మద్దతు అడిగారు..నన్ను మద్దతు తెలపమని కాపులు గాని ఎస్సీలు గాని అడగలేదు, నన్ను కమ్మ వారు మద్దతు అడిగారు. వారు అడిగారని నేను మద్దతు తెలపలేదు, అనుభవం వున్న నాయకుడు చంద్రబాబు గారు అని మద్దతు తెలిపాను. జగన్ గారు రెడ్డి కులం అని కాదు, ఆయనకి అనుభవం లేదని మద్దతు తెలపలేదు. 

* ఒకే కులం, ఒకే కుటుంబం, ఒకే తల్లికి పుట్టిన ఇద్దరికే ఒక్కొక్కసారి పడదు..మా అన్నయ్యని విభేదించి నేను రాజకీయాల్లోకి వచ్చాను, అక్కడ నన్ను ఏ కులం ఆపింది? మానవత్వంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. 

* నేను తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ ని ఏ విధంగా ఇరకాటంలో పెట్టాలా అని తెలుగుదేశం వారు ఆలోచిస్తారు..పవన్ కళ్యాణ్ మాట్లాడే పబ్లిక్ పాలసీల మీద ఎవరూ మాట్లాడరు.

* ఓట్ల కోసం మాట్లాడితే నేను కూడా వారిలా మాట్లాడేవాడినేమో!! ఈ కులం వారితో ఇలా మాట్లాడితే ఈ కులం ఓట్లు వస్తాయి అని ఆలోచించేవాడినేమో!!కాని నేను కుల రాజకీయాలు చెయ్యడానికి రాజకీయాల్లోకి రాలేదు.

* ఒక్క కులం చూస్తేనే నేను యాక్టర్ ని అవ్వలేదు, ఒక్క కులం చూస్తేనే నేను పవర్ స్టార్ ని అవ్వలేదు. అందరూ చూస్తే అయ్యాను. చెప్పుకోవడానికి ప్రాంతం అయితే బాగుంటుంది గాని కులం కాదు...కులం కూడు పెట్టదు. 

* నేను నెల్లూరులో పెరిగేటప్పుడు నాకూ నా స్నేహితులకు కులాల గురించి తెలియదు, అలాంటిది పెరిగి పెద్దయ్యాక రాజకీయాల్లోకి వచ్చాక కులాల గురించి ఎందుకు?

* నేను చాలా మంది దళిత విద్యార్థులను, మేధావులను కలిసాను. వారు మిగతా పార్టీలలా మీరు కూడా కులాలకు సంబంధించి విభాగాలు పెడుతున్నారా? అని నన్ను అడిగారు. కులాల పేర్లు చెప్పి మమ్మల్ని ఆ విభాగాలకు పరిమితం చెయ్యకండి అని వారు నాతో అన్నారు. అది ఆలోచించే జనసేన పార్టీలో సామాజిక న్యాయం అనే విభాగం పెట్టాను కాని కులాల విభాగాలు పెట్టలేదు.

* ఎవరైనా సరే ఓట్లు కావాలని రాజకీయం చేస్తున్నారు. మన దేశంలో కామన్ స్కూళ్ళు ఎందుకు లేవు? చిన్న వయస్సులోనే పిల్లలకు కులం అని చెప్పి మీరు సమాజాన్ని విచ్ఛిన్నం చెయ్యట్లేదా? అందుకే నేను లోతుగా ఆలోచించి కులాల ఐక్యత అని పెట్టాను. 

* దోపిడీ చేసే వ్యక్తులు, సమాజాన్ని నాశనం చేసే వ్యక్తులు.. వారు చేసే దోపిడీ కనపడకుండా కులాల ముసుగులో దాక్కుంటున్నారు. 

* తెలుగుదేశం పార్టీ వాళ్ళు నువ్వు ప్రజారాజ్యం పార్టీలో ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నారు..ప్రజారాజ్యం పార్టీ అధికారం లోకి వచ్చి ఉంటే తెలుగుదేశం మీద ఏ విధంగా పోరాడుతున్నానో అలాగే వారి మీద కూడా పోరాడేవాడిని. 

* నాకు జీవితాన్ని ఇచ్చిన అన్నగారిని కాదని నేను రాజకీయాల్లోకి వచ్చాను..అన్న గారు కాంగ్రెస్ లో వున్నా నేను ఆయనతో విభేదించి రాజకీయాల్లోకి వచ్చాను. నేను మా అన్నయ్యని, కాంగ్రెస్ ని వదిలేసి వస్తే చంద్రబాబు గారు కాంగ్రెస్ తో చేతులు కలుపుతున్నారు. దీని బట్టి ఎవరికీ అవగాహన, ఆలోచన ఉందో అర్ధం చేసుకోవొచ్చు.. 

* నాకు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి గొడవలు లేవు, 1997లో తెలంగాణను విభజిస్తామని చెప్పి మేనిఫెస్టో లో పెట్టి  అందంగా ఎందుకు విభజించలేదు? అన్యాయంగా వాళ్ళు విభజించడం వల్లనే లక్షలాది మంది బీసీ కులస్థులు తెలంగాణాలో రిజర్వేషన్లు కోల్పోయారు. 

* ముఖ్యమంత్రి గారు బెల్టు షాపులను రద్దు చేస్తామని చెప్పి సంతకం పెట్టారు. బెల్టు షాపులు ఉంటే తాట తీస్తాం, తోలు తీస్తాం అని చెప్పారు..అలాంటి బెల్టు షాపులు కొవ్వూరులో ఉంటే ఎందుకు మాట్లాడట్లేదు? 

* ముఖ్యమంత్రి గారి ప్రధాన శ్లోకం..బాబు వస్తే జాబు వస్తాది అని, అనేక మంది వేల రైతులకు ఉపాధినిచ్చే..700 మంది కార్మికులకు ఉద్యోగాలు కల్పించే 'చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ'ని ఎందుకు మూసేసారు? వున్న జాబులు కల్పించలేకపోతున్నారు, అలాంటిది కొత్త జాబులు బాబు గారు ఎక్కడినుండి తీసుకొస్తారు?

* ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళినప్పుడు వైజాగ్ నుండి పాడేరు వెళ్లే దారిలో కొంత మంది నన్ను ఆపేసి వారి ఊరికి తీసుకెళ్లారు. అక్కడ ఎమ్మెల్యేల క్వారీల దగ్గరకి వెళ్ళాను, అక్కడ ఎక్కువ శాతం గిరిజనులు..అక్కడ జగన్ పార్టీకి మద్దతు తెలిపే వారు అన్నా మమ్మల్ని జగన్ గారు పట్టించుకోవట్లేదు, మీరు ఒకసారి రండి అని నన్ను తీసుకెళ్లారు. కొన్ని సంవత్సరాల నుండి క్వారీలు పేల్చడం వల్ల మా ఇల్లులు, చర్చ్ బీటలు వాడిపోతున్నాయి అని నాతో చెప్పారు.

* ఆరోజున నేను మీడియా ముఖంగా క్వారీలు పేల్చడం వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్న వైనాన్ని మంత్రిత్వ శాఖకు తెలియజేశాను..ఆరోజున వారు నా మాటలు పట్టించుకోలేదు. ఆ క్వారీల యజమానులైనటువంటి ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేను మొన్న చంపేసినప్పుడు అసలు పరిస్థితి ఇంత వరకు ఎందుకు వచ్చిందా అని నేను అనుకున్నాను. 

*ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే చనిపోవడానికి కారణం ముఖ్యమంత్రి గారి పరిపాలన సవ్యంగా లేకపోవడం. పబ్లిక్ పాలసీలు బలంగా ఉంటే ఎమ్మెల్యేలను మనం రక్షించుకోగలం. 

* గండిపోచమ్మ గట్టు మీద వున్న ఇసుకను తవ్వి దోచుకోవడం మీద వున్న ద్రుష్టి బట్టి, బెల్టు షాపులు నడపటానికి సహకరించడాన్ని బట్టి మేము మిమ్మల్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి? 

* నేను అంబేద్కర్ గారి ఆశయాలను సమాసమజాన్ని నిర్మించటం కోసం సంపూర్ణంగా గుండెల్లో నింపుకున్నవాడిని అని జవహర్ గారికి చెప్తున్నా..జవహర్ గారు దళిత వర్గంకు చెందిన పెద్ద నాయకులు అయ్యి ఉండి బెల్టు షాపులను నడిపిస్తే దళితులకు, అణగారిన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందా? 

* మహాత్మా గాంధీ ఉపాధి పథకం అని చెప్పి ఒక వైపు డబ్బులు ఇస్తూ మరో వైపు బెల్టు షాపులు ద్వారా డబ్బులు తీసేసుకుంటుంటే ప్రభుత్వ ఖజానా పెరగదా మరి? అలా పెరిగిన దాన్ని నేను పెంచాను అని జవహర్ గారు చెప్పుకుంటున్నారు.

* జవహర్ గారిలా కాని, తెలుగుదేశం నాయకులలా గాని కుల రాజకీయాలు చెయ్యడానికి రాలేదు, బలమైన సామాజిక మార్పు తీసుకు రావడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. 

* ఆదిలాబాద్ లో నక్సలైట్లు వున్నారంటే అదో విధానం, నల్గొండ..శ్రీకాకుళం జిల్లాల్లో వున్నారంటే అదో విధానం, కాని పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అసహనానికి గురైన యువత మేము నక్సలైట్లు అయిపోదామనుకుంటున్నాం అన్నా అని నాతో అన్నారు. 

* ఆయుధాలను పట్టుకోవాలని ఎవరూ అనుకోరు, హింసా మార్గం పట్టాలని ఎవరూ అనుకోరు, ఇలాంటి దోపిడీ వ్యవస్థ ఉండి..అధికారులు దౌర్జన్యం చేస్తేనే అలాంటి ఆలోచనలు వస్తాయి.

* మాట్లాడితే ముఖ్యమంత్రి గారు త్యాగాలు చెయ్యండి అని ప్రజలను కోరతారు..ముఖ్యమంత్రి గారు చేసేస్తున్నారా త్యాగాలు? ముఖ్యమంత్రి గారు గాని, వారి కుటుంబీకులు గాని త్యాగాలు చెయ్యరంట కానీ సామాన్యులు చెయ్యాలంట..వాళ్ళు మాత్రం రాజరికాలు చేస్తున్నారు.    

* ప్రజా వ్యవస్థ సర్వ నాశనం అవుతుంటే యువత ఆయుధాలు పట్టుకోకుండా ఏమి చేస్తారు? కచ్చితంగా ఆయుధాలు పట్టుకుంటారు.

* పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు సహనం ఎక్కువ వుంటాది, అలాంటిది ఇక్కడే యువత ఆలోచనలు ఆయుధాలు పట్టేలా ఉంటే మిగతా ప్రాంతాలలో పరిస్థితిని అర్ధం చేసుకోవొచ్చు. 

* క్వారీలను అక్రమంగా తవ్వేస్తున్నా అడిగేవారు లేనప్పుడు తీవ్రవాద ఉద్యమాలు రాకుండా శాంతియుతమైన ఉద్యమాలు వస్తాయా? యువత కడుపు మండి వుంది, లోకేష్ గారు ఒక్కరే యువత కాదు..రాష్ట్రంలో అనేక మంది యువత వున్నారు. 

* కొవ్వూరులో 5 వేల ఎకరాలలో నిర్మించాల్సిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 8 సంవత్సరాల నుండి నిర్మాణంలో అలానే వుంది. మీరు అలాంటి వాటిని పట్టించుకోకుండా ప్రతీసారీ పోలవరం గుంరించే మాట్లాడతారు.

* ఒక అభిమాని : అన్నా..కొవ్వూరులో డిగ్రీ కాలేజీ లేదు?  
   జనసేనుడి సమాధానం : మీరు డిగ్రీలు చదివితే డిగ్రీలు చేతికి వస్తాయి, డిగ్రీలు వస్తే ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలంటే పరిశ్రమలు పెట్టాలి, పరిశ్రమలు పెట్టాలంటే ముఖ్యమంత్రి గారికి తెలిసిన వ్యక్తులై ఉండాలి, పరిశ్రమలు పెట్టాలంటే లైసెన్స్లు కావాలి..వారికి లైసెన్స్లు వచ్చిన తర్వాతే డిగ్రీ కాలేజీలు నిర్మిస్తారు, అప్పటి వరకూ నిర్మించరు. 

* ప్రతీ నియోజకర్గం లోనూ, మండలాల్లోనూ చిన్న చిన్న ప్రాజెక్టులను ప్రజలు అడుగుతారు..అవి నిర్మిస్తే డబ్బులు రావని నాయకులు నిర్మించరు.
 
* మోడీ నాకేమైనా అన్నా, బాబాయా? అమిత్ షా నాకేమైనా చుట్టమా? వారిని చూస్తే చంద్రబాబుకే భయం. 2014 ఎన్నికల తరవాత అమిత్ షా నాతో మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్ లేదు బిజెపీలో కలిపేయి అన్నారు.  నేనెందుకు కలుపుతా... తెలుగు జాతి గౌరవాన్ని చివరి వరకూ కాపాడతాను. 

* ప్రత్యేక హోదా సాధన కోసం తొలి నుంచీ పోరాడుతుంటే – ఆ విషయాన్ని వ్యతిరేకించినది ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పుడు మాట మార్చారు. నేనెప్పుడూ హోదా అనే మాట మీదే ఉన్నారు. మన ముఖ్యమంత్రి అద్భుతమైన నటుడు. ఆయన అన్న మాటలు వినిపించినా నేను అనలేదు అని తప్పించుకోగలరు. 

* కాంగ్రెస్స్ నాకేమైనా శత్రువా? ఆ పార్టీ అంటే కోపం ఉంది. ఎందుకంటే తెలుగువారిని అడ్డగోలుగా, పార్లమెంట్ తలుపులు వేసి విడదీశాయి జాతీయ పార్టీలు. తెలుగువారిని అడ్డగోలుగా, పార్లమెంట్ తలుపులు వేసి విడదీసిన పార్టీ అది. ఇప్పుడు చంద్రబాబు ఆ పార్టీతో చేతులు కల్పుతున్నారు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు.

 

 

 

 

SOURCE:JANASENA.ORG

 

11 Oct, 2018 0 450
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved