జ‌గ‌న్‌.. ప‌వ‌న్ క‌లుస్తున్నారా? ఆర్కే విశ్లేష‌ణ‌!
విభాగం: రాజకీయ వార్తలు
rk-point-of-view-about-jagan-pawan-alliance_g2d

వారాంతంలో వారంపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల‌కు సంబంధించిన అంశాల్ని గుది గుచ్చి.. బ‌య‌ట‌కుక‌నిపించే అంశాల‌తో పాటు.. బ‌య‌ట‌కు రాని మరికొన్ని అంశాల్ని.. త‌న‌కు ప‌రిచ‌య‌మున్న అంశాల్ని ప్ర‌స్తావిస్తూ.. త‌న‌దైన విశ్లేష‌ణ చేసే అల‌వాటు ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ‌కు ఉంద‌న్న విష‌యం తెలిసిందే.

స్థానిక రిపోర్ట‌ర్ స్థాయి నుంచి కెరీర్ స్టార్ట్ చేసి ఒక పేరున్న మీడియా సంస్థ‌కు అధినేత‌గా మార‌టం అంత తేలికైన విష‌యం కాదు. తాను ఉద్యోగిగా ప‌ని చేసిన సంస్థ న‌ష్టాల్లో కూరుకుపోయి మూసివేస్తే.. దాన్ని టేకోవ‌ర్ చేయ‌టం.. దాన్ని పోటీ ప‌త్రిక‌గా మార్చ‌టం వెనుక జ్యోతి ఆర్కే తెలివిని.. సామ‌ర్థ్యాన్ని తీసి పారేయ‌లేం. 

ప‌త్రిక‌.. ఆ త‌ర్వాత ఛాన‌ల్ పెట్టటం ఒక ఎత్తు అయితే.. ప్ర‌ధాన ప‌త్రిక‌ల‌తో పోటీ ప‌డుతూ.. తానో ప్ర‌ధాన‌మైన మీడియా సంస్థ‌గా పేరు పొంద‌టం అంత సులువు కాదు. అయితే.. ఇలాంటి స‌వాళ్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొంటూ.. త‌న స‌త్తాను చాటిన ఆర్కే.. ప్ర‌తి వారాంతంలోనూ త‌న‌దైన శైలిలో రాజ‌కీయ విశ్లేష‌ణ చేస్తుంటారు. బాబుకు వెన్నుద‌న్నుగా నిలుస్తార‌న్న పేరున్న ఆయ‌న‌.. ఈ వారం ఒక విచిత్ర‌మైన విశ్లేష‌ణ‌ను తెర మీద‌కు తెచ్చారు.

ఏపీలో బాబును ప‌ద‌వి నుంచి దించేయ‌టం కోసం బీజేపీ భారీ ప్లాన్ వేసింద‌ని.. అందులో భాగంగా జ‌గ‌న్‌-ప‌వన్ ల‌తో క‌లిసి అప్ర‌క‌టిత పొత్తుతో ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తార‌న్న వాద‌న‌ను వినిపించారు. ఇందుకు ప్రాతిప‌దిక‌గా ఆయ‌న చూపిన అంశాల్ని ఆయ‌న మాట‌ల్లోనే చ‌ద‌వాల్సిందే. అయితే.. ఆయ‌న వాద‌నంతా విన్న‌ప్పుడు వ‌చ్చే సందేహం ఒక్క‌టే. ఎంత బాబు మీద కోపం ఉంటే మాత్రం.. తాను మొద‌ట్నించి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ని జ‌గ‌న్ తో క‌లిసి న‌డ‌వాల‌న్న ఆలోచ‌న‌ను ప‌వ‌న్ ఎందుకు చేస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌. అంతేకాదు.. హోదా ఎపిసోడ్ లో పొత్తు పై నానుస్తున్న బీజేపీ పెద్ద‌ల‌ను ఉద్దేశించి.. పాచిపోయిన ల‌డ్డూలంటూ విరుచుకుప‌డిన ప‌వ‌న్‌.. ఇప్పుడు వారి మార్గ‌ద‌ర్శ‌నంలో న‌డ‌వ‌టానికి ఎందుకు ఒప్పుకున్నార‌న్న విష‌యాన్ని కూడా ప్ర‌స్తావిస్తే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక‌.. జ‌గ‌న్‌.. ప‌వ‌న్‌.. బీజేపీల అప్ర‌క‌టిత పొత్తు మీద ఆర్కే మార్క్ విశ్లేష‌ణ సాగిన విధానం య‌థాత‌ధంగా చూస్తే..

ఇప్పుడు లోపాయికారీ రాజకీయంలోకి జనసేన పార్టీ కూడా భాగస్వామి అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ దర్శకత్వంలో తనకు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, జగన్మోహన్‌రెడ్డి, పవన్‌కల్యాణ్‌ ఒక్కటయ్యారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలే ఆరోపించారు. ఈ ఆరోపణలను కొట్టిపారేయడానికి వీలు లేదన్నట్టుగా జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. తెలంగాణలో కూడా తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఒకప్పుడు ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినా కూడా ఆ ఊసే ఎత్తడం లేదు. 

నిజానికి జనసేన పార్టీ విడిగా పోటీచేస్తే ఓట్లు చీలి తెలంగాణ రాష్ట్ర సమితికి లాభం చేకూరుతుంది. అయితే.. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మహా కూటమి ఏర్పాటు అవ్వడంతో ఎన్నికలలో టీఆర్ఎస్‌కు జనసేన పార్టీ మద్దతు ఇవ్వబోతున్నదన్న ప్రచారం ఊపందుకుంటోంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సహకరించడంతో పాటు, ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు నష్టం కలిగించేలా పవన్‌ కల్యాణ్‌ వ్యవహరించడం వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. 

ఏపీలో ఎన్నికలు సమీపించే నాటికి వైసీపీ–జనసేన–బీజేపీ మధ్య లోపాయికారీ అవగాహన మరింత బలపడుతుందని కూడా రాజకీయ విశ్లేషణలు వినబడుతున్నాయి. భిన్నమైన మనస్తత్వాలు కలిగిన జగన్మోహన్‌ రెడ్డి, పవన్‌ కల్యాణ్‌ను ఒక్కటి చేసి.. కలిసి పోటీ చేయించడానికి బీజేపీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

జనసేన పార్టీలోని కొంతమంది నాయకులు కూడా ఎన్నికలలో వైసీపీతో కలిసి పోటీచేయాలని కోరుకుంటున్నారు. వైసీపీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే పవన్‌ కల్యాణ్‌ అనే స్థిరత్వం ఉండని వ్యక్తితో పెట్టుకుంటే గుదిబండలా మారతారన్న అభిప్రాయంతో జగన్మోహన్‌ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు.

 ఈ కారణంగానే ఈ రెండు పార్టీల మధ్య అవగాహన అనేది ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్టుగానే ఉంది. అయితే ఆడించే వారు తెరవెనుక ఉన్నారు కనుక మున్ముందు ఏమి జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం! ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా బీజేపీ పెద్దలు అమలుచేస్తున్న వ్యూహానికి ‘ఆపరేషన్‌ గరుడ’ అన్న పేరు కూడా రాష్ట్ర ప్రజలలో స్థిరపడిపోయింది.

 అధికార పార్టీకి చెందిన ముఖ్యులు, పార్టీతో సంబంధాలున్న కంపెనీలపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఆదాయపు పన్నుశాఖ అధికారుల దాడులు హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ దాడులను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శిస్తుండగా, ‘మీరెందుకు ఉలిక్కి పడతారు?’ అంటూ వైసీపీ, జనసేన, బీజేపీలు సమర్థిస్తున్నాయి. వైసీపీ–జనసేన మధ్య పొత్తు కుదరడం అంటే తూర్పు– పడమర కలిసినట్టే అవుతుంది. అయినా ఉత్తర– దక్షిణ ధ్రువాలయిన జగన్‌– పవన్‌లను కలపడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. 

‘‘చంద్రబాబును ఓడించడానికే పరిమితం అవుతామా? సొంతంగా ప్రయోజనం పొందవద్దా?’’ అన్న ప్రశ్న కూడా స్థానిక బీజేపీ నాయకులలో వ్యక్తమయ్యింది. దీనికి కూడా బీజేపీ పెద్దల వద్ద సమాధానం ఉంది. పార్టీ ముఖ్యనాయకులు పోటీచేసే స్థానాలలో వైసీపీ తరఫున బలహీనమైన అభ్యర్థులను పోటీ పెట్టేలా ఒప్పందం జరిగిందని బీజేపీకి చెందిన ఒక ముఖ్యుడు చెప్పారు. 

అదే నిజమైతే వైసీపీ–బీజేపీ మధ్య లోపాయికారీ అవగాహనతోపాటు లాలూచీ రాజకీయం కూడా నడుస్తోందని భావించవలసి ఉంటుంది. రాజకీయాలలో ఇన్ని మర్మాలుంటాయని పవన్‌ కల్యాణ్‌కు తెలుసని భావించలేం. అయితే, చంద్రబాబును పదవీచ్యుతుడిని చేయాలని ఆయన సంకల్పం చెప్పుకొన్నందున చంద్రబాబు వ్యతిరేక వ్యూహంలో ఆయన కూడా భాగస్వామి కావచ్చునన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. 

నిన్నమొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన పవన్‌కల్యాణ్‌ ఇప్పుడు చంద్రబాబును తిట్టిపోయడానికే పరిమితం అవుతున్నారు కనుక ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

 

 

 

SOURCE:GULTE.COM

14 Oct, 2018 0 366
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved