
వార్తాపత్రికల్లో తన కాలమ్స్‌తో అత్యంత ప్రజాదరణ పొందిన సెక్సాలజిస్ట్ డాక్టర్ మహీంద్ర వత్స(96) మరణించినట్లు ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు.
గైనకాలజిస్ట్, అబ్సెస్ట్రీషియాన్ అయిన మహీంద్ర వత్స 'ఆస్క్ ది సెక్స్‌పర్ట్' పేరుతో పదేళ్లకు పైగా పత్రికల్లో కాలమ్ నిర్వహించారు.
అందులో ఆయన సెక్స్‌కు సంబంధించి పాఠకులు అడిగే సందేహాలకు సమాధానాలు ఇచ్చేవారు.
వేలాది మంది తమ లైంగిక జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు, తమకు ఉన్న సందేహాలను డాక్టరు మహీంద్రను అడిగితే ఆయన విపులంగా సమాధానాలు, సలహాలు ఇచ్చేవారు.
ఆ సందర్భంగా ఆయన చూపించే చతురత, సున్నితమైన హాస్యం అందరినీ ఆకట్టుకునేది.
80 ఏళ్ల వయసులోనూ..
'ముంబయి మిర్రర్' పత్రికలో డాక్టర్ మహీంద్ర తన 'ఆస్క్ ది సెక్స్‌పర్ట్' కాలమ్ ప్రారంభించేనాటికి ఆయన వయసు 80 ఏళ్లు.
ఇప్పటికీ భారతదేశంలోని అనేక ఇళ్లలో బాహాటంగా మాట్లాడుకోని విషయం అయిన సెక్స్ గురించి ఆయన ఇచ్చే సలహాలు ఎందరికో ఉపయోగపడ్డాయి.
'మేం డాక్టరు మహీంద్రతో ఈ కాలమ్ ప్రారంభించేవరకు కూడా భారతీయ మీడియాలో 'పెనిస్', 'వేజినా' వంటి పదాల వాడకం అత్యంత అరుదుగా ఉండేదని ఆ పత్రిక ఎడిటర్ బఘేల్ 2014లో ఓ సందర్భంలో 'బీబీసీ'తో చెప్పారు.
ఈ కాలమ్ ప్రారంభించిన తరువాత తాము అశ్లీల సమాచారం పంచుతున్నామంటూ ఆరోపణలు, కేసులు ఎదుర్కొన్నామని.. విద్వేషం కక్కుతూ రాసిన మెయిళ్లు, బెదిరింపు మెయిళ్లు వచ్చేవని ఆమె చెప్పారు.
సమస్యలు ఎదురైనా కూడా ప్రజలకు దాని వల్ల మేలు జరుగుతుందని కొనసాగించామని చెప్పారామె.
ఒక్క ముంబయి మిర్రర్లోనే డాక్టర్ మహీంద్ర 20 వేల మందికి పైగా ప్రజల సమస్యలకు సమాధానాలిచ్చారని.. సెక్స్ కౌన్సెలర్‌గా ఆయన మొత్తంగా 40 వేల మందికి పైగా సలహాలు ఇచ్చి ఉంటారని బఘేల్ తమ పత్రికలో రాసిన వ్యాసంలో చెప్పారు.
1960ల్లో మొట్ట మొదట ఓ మహిళల మ్యాగజీన్ ఆయన్ను ఇలాంటి సెక్సాలజీకి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలివ్వాలని కోరింది. అప్పటికి ఆయన 30ల్లో ఉన్నారు. 'డియర్ డాక్టర్' పేరిట కాలమ్ నిర్వహించారు.
'నాకు పెద్దగా అనుభవం లేదు' అని ఆయన 2014లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల చాలామంది సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన తనకు వచ్చే అనేక ప్రశ్నల ఆధారంగా గుర్తించారు.
అందుకే సెక్స్ ఎడ్యుకేషన్ అందివ్వడం అనేది తన జీవిత కార్యక్రమంగా పెట్టుకున్నారాయన.
మొదట ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌పీఏఐ) ద్వారా సలహాలు ఇచ్చిన ఆయన అనంతరం సొంతంగా 'కౌన్సెల్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ పేరెంట్‌హుడ్ ఇంటర్నేషనల్' అనే సంస్థను స్థాపించి దాని ద్వారా పనిచేశారు.
పాఠకులు తనను అడిగే ప్రశ్నలకు సమాధానాలిచ్చేటప్పుడు ఆయన వాటికి అప్పుడప్పుడు చతురత కూడా జోడించేవారు.
అలాంటి కొన్ని ప్రశ్నలు-సమాధానాలు చూద్దాం..
ప్రశ్న: డాక్టర్ గారూ.. రెండు రోజుల కిందట నా గర్ల్ ఫ్రెండ్‌తో ఎలాంటి రక్షణ లేకుండా సెక్స్ చేశాను. అయితే, ఆ తరువాత గర్భం రాకుండా ఉండడానికి ఐ-పిల్(గర్భ నిరోధక మాత్ర) కొనుక్కొచ్చాను. కానీ, గర్ల్ ఫ్రెండ్‌కి ఇవ్వడానికి బదులు నేనే అది మింగేశాను.. ఏమైనా అవుతుందంటారా?
డాక్టర్ మహీంద్ర సమాధానం: ఈసారి సెక్స్ చేసేటప్పుడు కండోమ్ వాడు. అది మాత్రం మింగేయొద్దు నాయనా.
ప్రశ్న: ఆమ్లాలు(యాసిడ్స్) ఏవైనా గర్భం రాకుండా చేస్తాయని విన్నాను. సెక్స్ తరువాత నా గర్ల్‌ఫ్రెండ్ యోనిలో కాస్త నిమ్మరసం పిండమంటారా డాక్టర్?
డాక్టర్ మహీంద్ర సమాధానం: నీది పానీపూరీ వ్యాపారమా ఏమిటి? ఇలాంటి అసహజమైన ఆలోచన ఎందుకొచ్చింది. గర్భం రాకుండా అనేక సురక్షితమైన పద్ధుతులున్నాయి. చక్కగా కండోమ్ వాడు. అంతేకానీ, ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు.
ప్రశ్న: ఏరోజైనా నాలుగు సార్లు సెక్స్ చేస్తే ఆ మరుసటి రోజు బాగా నీరసంగా ఉంటోంది. అయిదు నిమిషాల పాటు కళ్లు మసకగా మారిపోతున్నాయి.
డాక్టర్ మహీంద్ర సమాధానం: ఏమనుకుంటున్నావు నువ్వు.. మీ టౌన్లో నువ్వే చాంపియన్ అయిపోదామనుకుంటున్నావా.. ఎందుకు అన్నిసార్లు?
ప్రశ్న: పెళ్లి చేసుకోమని ఇంట్లోవాళ్లు బలవంతం చేస్తున్నారు. కాబోయే భార్య కన్యా కాదా అని ఎలా తెలుసుకోవాలి?
డాక్టర్ మహీంద్ర సమాధానం: డిటెక్టివ్‌లను అపాయింట్ చేస్తే తప్ప ఇది తెలియదు. నీ అనుమానం బుద్ధితో అమాయకపు ఆడపిల్లలతో ఆడుకోవద్దు.. వదిలిపెట్టు. అసలు నువ్వు పెళ్లే చేసుకోవద్దన్నది నా సలహా.
Credits - BBC Telugu