
యువత కోరుకుంటోంది 25 ఏళ్ల భరోసా గానీ, 25 కేజీల బియ్యం కాదని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్‌కళ్యాణ్ గారు అన్నారు. శుక్రవారం వివిధ పార్టీలకి చెందిన నాయకులు, ప్రముఖులు అనుచరులతో సహా జనసేన పార్టీలో చేరారు. అందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసైనికులని ఉద్దేశించి మాట్లాడారు.
"1500 రూపాయిల పాకెట్ మనీ ఇచ్చి మభ్యపెట్టేందుకు జనసేన పార్టీ పెట్టలేదు. 25 ఏళ్ల భవిష్యత్ ఇచ్చేందుకే ప్రారంభించాను. ప్రజలు కోరుకుంటోంది కూడా తాత్కాలికంగా ఇచ్చే రూ. 1500 పాకెట్ మనీ కాదు. అదే పాకెట్ మనీ తమ పిల్లలకి ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. మెరుగైన ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. జనసేన ఆశయం కూడా అదే. పచ్చటి కొబ్బరి తోటలతో కోనసీమని తలపించేలా ఉండే ఉద్దానం, ఇప్పుడు ఆనాటి హిరోషిమాను తలపిస్తోంది. పాలకులు, అధికారులు చూడాల్సింది శ్రీకాకుళం టౌన్లో కాదు. ఇచ్చాపురం వెళ్లి చూడండి. ప్రజల కష్టాలు తెలుస్తాయి. తిత్లీ బాధితులు తినడానికి తిండి లేదు. బోట్లు మొత్తం కొట్టుకుపోయాయి. తిత్లీ తుపాను నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. ఐదు బస్తాల జీడి అమ్ముకుంటే పిల్లల చదువు పూర్తయ్యేది. ఇప్పుడు జీడి రైతులు భయపడుతున్నారు. ఇప్పటికే భూములు కొంటామంటూ ఏజెంట్లు రంగంలోకి దిగారు. భూములు బలవంతంగా లాక్కుంటారేమో అన్న భయం రైతుల్లో పెరిగిపోయింది. అసలే వెనుకబడిన ప్రాంతం. తుపాను కారణంగా వలసలు పెరగరాదు. ఆ వలసల్ని ఆపడమే జనసేన లక్ష్యం. ప్రభుత్వం చేపట్టే సహాయ కార్యక్రమాలను విమర్శించడానికో, ఇతర పార్టీల్లా రాజకీయం చేయడానికో ఇక్కడికి రాలేదు. తుపాను నష్టాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లడానికి వచ్చా. బాధితులకి అండగా మేమున్నాం అంటూ భరోసా ఇవ్వడానికి వచ్చా.ఓటమి లోతుల్లో నుంచి పుట్టిన పార్టీ జనసేన. కష్టాల్లో నుంచి పుట్టిన పార్టీ జనసేన. నేను నష్టపోయినా, ప్రజల కోసం ఏ స్థాయి వ్యక్తితో అయినా గొడవ పెట్టుకోవాడానికి సిద్ధంగా ఉన్నా. దసరా రోజు ఆయుధం స్వీకరించా, 2019 కురుక్షేత్రంలో ధర్మం గెలిచే వరకు పోరాటం చేస్తాన"ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.
జనసేనలో చేరిన పలువురు ప్రముఖులు
జనసేన పార్టీలో చేరే ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్‌కళ్యాణ్ గారు పిలుపు నిచ్చారు. శుక్రవారం శ్రీకాకుళంలో పలువురు ప్రముఖులని శ్రీ పవన్ కళ్యాణ్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ తీర్ధం పుచ్చుకున్న వారిలో యలమంచిలికి చెందిన శ్రీ సుందరపు విజయ్‌కుమార్, శ్రీ విల్లా శ్రీనివాసరావు, యంగ్ ఇండియన్ ట్రస్ట్ అధినేత శ్రీ పిండి వెంకట సురేష్, విశాఖ పట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీ పసుపులేటి ఉషాకిరణ్, గాజువాకకి చెందిన శ్రీ ఈటి రంగారావు, అరకుకి చెందిన గిరిజన నాయకుడు శ్రీ గంగులయ్య, పాయకరావుపేటకి చెందిన శ్రీ శివదత్, ప్రముఖ న్యాయవాది శ్రీ చంద్రమౌళి, శ్రీ దాసరి కుమారి , శ్రీ దాసరి జగదీష్, ఆముదాలవలసకి చెందిన శ్రీ భారతీ రవికిరణ్, బీజేపీ నాయకురాలు శ్రీ ఎం.ఎన్.విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముందు వేదికపై దసరా సందర్భంగా అమ్మవారికి పూజాదికాలు నిర్వహించారు.
SOURCE:JANASENA.ORG