
కొంతకాలంగా మౌనంగా ఉండటం.. అదును చూసి మాట్లాడటం కొంతమంది నేతల అలవాటు. దీనికి ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్పినా.. అంతగా అతకవని చెప్పాలి. కానీ.. అలాంటి పరిస్థితుల్ని సైతం తనకు అనుకూలంగా మార్చుకోవటంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్.. ఒకప్పటి సినీ నటి విజయశాంతి అలియాస్ రాములమ్మ సక్సెస్ అయ్యారని చెప్పాలి.
2014 సార్వత్రిక ఎన్నికల్లో బరిలో నిలిచి.. ఓటమి అనంతరం కనిపించని విజయశాంతి ఈ మధ్యన రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. శస్త్రచికిత్స చేయించుకోవటంతో తాను క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా లేనని చెప్పటం తెలిసిందే.
ఒకప్పుడు కేసీఆర్ కు దేవుడిచ్చిన చెల్లిగా టీఆర్ఎస్ లో ప్రముఖ పాత్రను పోషించిన విజయశాంతి.. ఈ మధ్యన గులాబీ బాస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయటం ద్వారా సంచలనం సృష్టించారు. తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన రాములమ్మ.. ప్రముఖ సినీ నటుడు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీపై ఆమె స్పందించారు.
తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెబుతున్నారన్న ప్రశ్నకు ఇప్పటివరకూ జనసేన ఆ మాట చెప్పలేదని.. తెలంగాణలో తాము పోటీ చేసే విషయంపై పవన్ ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదన్నారు. ఎన్నికల బరిలోకి ఆ పార్టీ ఉంటుందని ప్రకటించిన తర్వాత తాను మాట్లాడతానని చెప్పారు. ఒకవేళ పవన్ పోటీకి దిగితే ఆయన ప్రభావం ఎలా ఉంటుందో చూడాలన్నారు.
జనసేన మీద తనకంటూ ఒక అభిప్రాయం లేదని.. ప్రజల అభిప్రాయాలను మాత్రమే తాను తీసుకుంటానని చెప్పారు. ప్రజల తరఫునే ఆలోచించి.. ప్రజల తరపునే అడుగుతానని చెప్పారు. టీఆర్ఎస్ మాదిరి కాంగ్రెస్ ప్రజలను మోసం చేయదన్నారు. నోటికి వచ్చినట్లుగా కాంగ్రెస్ మాట్లాడని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.30వేల కోట్ల దోపిడీకి పాల్పడిందని.. తాము అధికారంలోకి వచ్చాక కేసీఆర్ చేసిన అక్రమాల్ని వెలుగులోకి తెస్తామన్నారు.
SOURCE:GULTE.COM