పార్టీలో చిత్తశుద్దిగా పనిచేసేవాళ్ళకి అండగా నిలుస్తాం - శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
విభాగం: రాజకీయ వార్తలు
we-will-be-alongside-of-those-who-will-be-loyal-to-party-says-pawan_g2d

సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల దగ్గరకు వెళ్లి వాళ్ళ బాధలు వినాలి... అప్పుడే వారి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.

అయితే ప్రజల సమస్యలను ఓపికగా వినేవాళ్ళు లేకుండాపోతున్నారు... కనీసం ఎంపీటీసి కూడా తన ప్రజల బాధలు వినడం లేదన్నారు.  'అరకు ప్రాంతానికి వెళ్తే అక్కడి మహిళలు కోరుకొంటున్నది బిందెడు స్వచ్ఛమైన మంచి నీళ్లు కావాలని... అన్ని కష్టాల్లో ఉన్నా వారికో ఆశ ఉంది, అలాంటి ప్రజల ఆశలు నెరవేర్చాలి. తాగ‌టానికి నీళ్లు లేవు, ప్రాథ‌మిక వైద్యం అందక ప్రాణాలు పోతున్నాయి అయినా అర‌కు గిరిజ‌న మ‌హిళ‌ల ముఖాల్లో చిరున‌వ్వు చెక్కుచెద‌ర‌లేదు. ఆశావాద దృక్పథం వారిలో ఉంది' అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. గురువారం ఉదయం హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లాకి చెందిన వివిధ పార్టీల నాయకులు జనసేనలో చేరారు. మాజీ ఎమ్మెల్సీ శ్రీ కందుల దుర్గేష్, తూర్పు గోదావరి జిల్లా మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ పంతం వెంకటేశ్వర  రావు (నానాజీ) పార్టీలో చేరారు. వీరితోపాటు సుమారు 500 మంది జనసేనలో చేరారు. వీరికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ "పార్టీలోకి వచ్చిన శ్రీ కందుల దుర్గేష్, శ్రీ పంతం నానాజీలకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. ఇది నా పార్టీ అని ఎప్పుడూ అనుకోలేదు. 'నా' అనే భావన ఎప్పుడూ ఉండదు. మనది, మనం అనే భావనలే ఉంటాయి. ఇది మనందరి పార్టీ.  కష్టాల్లో ఉన్న ప్రజలకి అండగా నిలిచి చేయూతనీయడమే జనసేన లక్ష్యం. నటుడిగా సినిమాలు చేసినప్పుడూ నా మనసంతా కష్టాలు, బాధల్లో ప్రజల గురించిన ఆలోచనలతోనే ఉండేది. వర్తమాన రాజకీయాల్లో అవినీతి, నీతి ఉన్నాయి. అంతా అవినీతిమయం అని ఎవరూ పట్టించుకోకపోతే ప్రజల బాధలు తెలియవు. మనుషులందరినీ ఒక భావజాలంతో దగ్గర చేసి ఒక తాటిపై నడిపించాలి. నేను నమ్మిన, సాధన చేసిన సిద్దాంతాలనే చెబుతున్నాను. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలని గుర్తించాలి.

నాలుగు గోడల మధ్య కూర్చొని సమస్యల్ని పరిష్కరిస్తామంటే కాదు. అందుకోసం జీవొలు ఇచ్చేస్తే సరిపోదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయి. వాటికి ప‌రిష్కారాలు చూపించ‌డంలో పాల‌కులు నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారు. ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యలను వినాలి. వారి దగ్గరే పరిష్కారం ఉంటుంది. సినిమాల్లో మాదిరి రెండు మూడు గంటల్లో పరిష్కారం అయిపోవు. క్షేత్ర స్థాయికి వెళ్లి చూడాలి. పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్తే పచ్చటి భూములు ఉంటాయి... కానీ జలాలు కలుషితం అయిపోయాయి. కష్టాల్లో ఉన్న ప్రజల పక్షాన నిలవాలి. నేను ఒక మాట చెప్పే ముందు ఆలోచిస్తాను... చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాను. మనది కొత్త పార్టీ. పార్టీకి తొలి తరం ఇది. ఆరంభంలో చిన్నపాటి కష్టాలు ఉంటాయి. అందరం కలసికట్టుగా ముందుకు వెళదాం. రాజకీయాలు స్వల్పకాలిక ప్రయోజనాలకు చేయడం లేదు. దీర్ఘకాలిక ప్రయోజనాలతో, భావితరాల క్షేమం కోసం వచ్చాను. అందుకే 25 ఏళ్ల కోసం వచ్చాను అని చెబుతుంటాను. ఈ రాజకీయాల్లో ఎన్ని కష్టాలు వచ్చిన బలంగా నిలబడతా. ఎంతటి ఒత్తిడి ఉన్న ఎదుర్కొంటా. పార్టీ కోసం చిత్తశుద్దిగా పనిచేసేవారికి అండగా ఉంటాను. త్రిక‌ర‌ణ‌శుద్ధితో ప్ర‌జాసేవ చేస్తాను. రాజ‌కీయాల్లో ఈ ప‌ని చేయాలి, ఈ ప‌ని చేయ‌కూడ‌ద‌ని గీత గీసుకుని రాలేదు. ముఖ్య‌మంత్రి అవుతామా..? ప్ర‌భుత్వాలు స్ధాపిస్తామా..? అనేది త‌ర్వాత, ముందు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయాలి" అన్నారు. 

 

 

 

SOURCE:JANASENA.ORG

31 Aug, 2018 0 349
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved