పవన్ తెలంగాణకు ఎందుకు రారు..?
విభాగం: రాజకీయ వార్తలు
why-pawan-will-not-come-to-telangana_g2d

తెలంగాణలో ముందస్తు జోరు ఊపందుకుంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్దుల ప్రకటనతో పాటు ప్రచారంలోనూ ముందుంది. మహాకూటమి పొత్తులపై మల్లగుల్లాలు పడుతోంది. ఒకటి రెండు రోజులలో ఈ చర్చలు ఫలించి అభ్యర్దుల ప్రకటన కూడా పూర్తి అవుతుంది. ఒకసారి అభ్యర్దులను ప్రకటించిన తర్వాత మహాకూటమి తన ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది. ఇక భారతీయ జనతా పార్టీ కూడా అభ్యర్దులను ప్రకటించి వ్యూహ రచనలో ఉంది. మజ్లిస్‌తో పాటు చిన్న చితక పార్టీలు, స్వతంత్ర అభ్యర్దులు కూడా తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికల బరిలో నిలబడడం లేదు. ఇలా అన్ని పార్టీలు, అభ్యర్దులు ముందుస్తు సంగ్రామంలో తొడ కొట్టి నిలుచున్నాయి. తెలంగాణలో తనకు అభిమానుల బలం ఉందని, తెలంగాణ పట్ల తాను సానుకూలంగా ఉన్నానని ఎన్నో సార్లు ప్రకటించిన జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ మాత్రం ముందస్తు ఎన్నికలపై పెదవి విప్పడం లేదు. 

అధికారంలో ఉన్న పార్టీలను ప్రశ్నిస్తానని, అవి తెలుగు రాష్ట్రాలే కానకర్లేదని ఇంతకు ముందు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆ లెక్కన చూసుకుంటే తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ ప్రచారం చేయాలి. జనసేన అభ్యర్దులను కొన్ని స్థానాల నుంచైనా ఎన్నికల బరిలో దింపాలి. 

తెలంగాణలో నిరంకుశ పాలన జరుగుతోందంటూ జత కట్టిన మహాకూటమితో కలవాలి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తున్న పవన్ కల్యాణ్ మహాకూటమికి మద్దతు ఇచ్చే అవకాశం లేదు. పైగా అన్న‌నే బ‌య‌ట‌కు లాగాల‌ని చూస్తున్నారు. ఇక మేధావుల పార్టీగా చెప్పుకుంటున్న తెలంగాణ జన సమితికైనా పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వాలి కదా అని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల, ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పట్ల పనన్ కల్యాణ్ సానుకూల‌త‌తో ఉన్నారు. 

అలాగని ఆయనకు ప్రచారం చేయలేరు. ఈ సంకట స్థితిని తెలంగాణలోని పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు జీర్ణించుకో లేకపోతున్నారు. ఈ ఎన్నికలలో కొన్ని స్థానాలలో పోటి చేసినా తమ ఉనికి వెల్లడవుతుందని, తద్వారా ముందు ముందు బలపడ వచ్చునని జనసేన నాయకులు, కార్యకర్తల అభిప్రాయంగా తెలుస్తోంది. ఇందుకు భిన్నంగా తమ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యవ‍హరించడం పై ఆ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వస్తోందంటున్నారు. దీంతో తెలంగాణలో పవన్ పరిస్థితి ఏమిటని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

 

 

 

 

SOURCE:GULTE.COM

10 Nov, 2018 0 410
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved