ఎంత స‌భ ప్లాప్ అయితే.. కేసీఆర్ శ‌కం ముగుస్తుందా?
విభాగం: రాజకీయ వార్తలు
will-kcr-end-up-with-flop-show-of-his-meeting_g2d

కాస్త సానుకూలంగా ప‌రిస్థితులుంటే చెల‌రేగిపోవ‌టం.. ఏ మాత్రం ప్ర‌తికూలంగా క‌నిపించినా డీలా ప‌డ‌టంలో కాంగ్రెస్ త‌ర్వాతే ఎవ‌రైనా. ప‌దేళ్ల పాటు నాన్ స్టాప్ అధికారాన్ని చేప‌ట్టి.. ప‌వ‌ర్ మ‌రీ బోర్ కొట్టింది భ‌య్.. ఐదేళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉంటే ఎంచ‌క్కగా రెస్ట్ తీసుకోవ‌చ్చ‌న్న మాట కొంద‌రు కాంగ్రెస్ నేత‌ల నోటి నుంచి గ‌తంలో వ‌చ్చేది. 

అయితే.. అలాంటి ఆలోచ‌న ఎంత తెలివిత‌క్కువ‌న్న విష‌యాన్ని కేసీఆర్ చేతికి ప‌వ‌ర్ వ‌చ్చిన త‌ర్వాత కానీ వారికి అర్థం కాలేదు. త‌ప్పు అయిపోయింది.. ఎద‌వ ఆలోచ‌న‌లు చేశామంటూ త‌మ‌ను తాము తిట్టుకునేవాళ్లు కోకొల్ల‌లు.

ఇదిలా ఉంటే.. నాలుగున్న‌రేళ్ల త‌ర్వాత కూడా కాంగ్రెస్ లో ఇప్ప‌టికి స‌మ‌ర‌స్ఫూర్తి రాని దుస్థితి నెల‌కొంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముంద‌స్తుకు వెళ్లే ఆలోచ‌న‌లు మా జోరుగా చేస్తున్న వేళ‌..  స‌మ‌రానికి సై అన్న‌ట్లుగా సిద్ధం కావాల్సి ఉన్నా కాని ప‌రిస్థితి. 

కాంగ్రెస్ నేత‌ల తీరును చూసి.. ఆ పార్టీ శ్రేణులు మ‌రింత నీర‌స‌ప‌డిన ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. కేసీఆర్ త‌న బ‌లాన్ని రెట్టింపు చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌తో ఏర్పాటు చేసిన ప్ర‌గ‌తి నివేద‌న స‌భ ప్లాప్ కావ‌టం.. పాతిక ల‌క్ష‌ల మంది వ‌స్తార‌ని డాబుగా ప్ర‌క‌ట‌న‌లుచేసినా.. ప‌ట్టుమ‌ని ప‌ది లక్ష‌ల మంది కూడా రాక‌పోవ‌టంతో ప్ర‌తిప‌క్షాల‌కు ఒక్క‌సారిగా ఊపు.. ఉత్సాహాన్ని ఇచ్చాయ‌ని చెప్పాలి.

ఇక‌.. కాంగ్రెస్ నేత‌లకైతే ప‌ట్ట‌ప‌గ్గాలు ఉండ‌టం లేదు. ప్ర‌తిపక్షంగా అధికార ప‌క్షానికి చుక్క‌లు చూపించే విష‌యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు దారుణంగా ఫెయిల్ అయ్యార‌ని చెప్పాలి. ఏపీలో విప‌క్ష నేత‌లంటే అధికార‌ప‌క్ష నేత‌లు వ‌ణికిపోయే ప‌రిస్థితి. తెలంగాణ‌లో దీనికి భిన్న‌మైన ప‌రిస్థితి ఉంద‌న్న విష‌యం తెలిసిందే.  అధికార‌ప‌క్ష నేత‌ల జోరుకు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు బేజారు ఎత్తే ప‌రిస్థితి.

ఇలాంటి వేళ‌.. చేతికి ల‌డ్డూ ఇచ్చే రీతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేప‌ట్టిన ప్ర‌గ‌తినివేద‌న స‌భ ప్లాప్ కావ‌టం.. అనుకున్నంత‌గా జ‌నం రాక‌పోవ‌టం.. సీఎం స్పీచ్ పెద్ద ఎఫెక్టివ్ గా లేక‌పోవ‌టంతో.. కాంగ్రెస్ నేత‌ల్లో ఉత్సాహం ఒక్క‌సారిగా పొంగుకు వ‌చ్చింది. నిరాశ‌.. నిస్పృహ‌లో ఉన్న వేళ కేసీఆర్ త‌న ప్ర‌గ‌తి నివేద‌న స‌భ ద్వారా ప్ర‌తిప‌క్షానికి చ‌క్క‌టి అవ‌కాశాన్ని ఇచ్చార‌ని చెప్పాలి. అయితే.. త‌మ‌కు ల‌భించిన అవ‌కాశాన్ని చ‌క్క‌టి గోల్ గా మార్చుకోవాల్సిన కాంగ్రెస్ నేత‌లు సెల్ఫ్ గోల్ దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌.. పాల‌కుల అవినీతి కార‌ణంగా ప్ర‌జ‌ల్లో స్పంద‌న లేద‌న్న రీతిలో కేసీఆర్ మీద విమ‌ర్శ‌ల దాడి చేప‌ట్టాల్సిన కాంగ్రెస్ నేత‌లు.. అందుకు భిన్నంగా కేసీఆర్ శ‌కం ముగిసింద‌ని.. ఆయ‌న ప‌ని అయిపోయిందంటూ చేస్తున్న వ్యాఖ్య‌లు స‌రికావ‌న్న‌మాట బ‌లంగా వినిపిస్తోంది. ఒక్క స‌భ‌తోనే కేసీఆర్ లాంటి బ‌ల‌మైన నేత శ‌కం ముగిసింద‌న్న మాట పార్టీలో కొత్త స్ఫూర్తిని ర‌గిలించ‌ట‌మే కాదు.. కాంగ్రెస్ నేత‌ల హ‌డావుడి మాట‌లకు త‌మ‌ను తాము ఫ్రూవ్ చేసుకోవాల‌న్న భావ‌న క‌లిగిస్తే.. అది విప‌క్ష పార్టీకి ఇబ్బందిగా మారుతుంద‌న్న విష‌యాన్ని ఉత్త‌మ్ బ్యాచ్ గుర్తిస్తే మంచిది. 

ఓట‌మిలో ఉన్న వారిని మ‌రింత కుంగ‌దీసేలా చేయాలి.. పోరాట‌మంటే ఓట‌మే అన్న భ‌యాన్ని క‌లుగ‌జేయాలే త‌ప్పించి.. ఏమైనా వాళ్ల సంగ‌తి చూడాల‌న్న‌ట్లుగా పోరాట స్ఫూర్తిని త‌ట్టి లేపేలా మాట్లాడ‌టం.. త‌మ గొయ్యిని తాము త‌వ్వుకున్న‌ట్లేన‌న్న విష‌యాన్ని ఉత్త‌మ్ బ్యాచ్ గుర్తిస్తే మంచిది.

 

 

 

SOURCE:GULTE.COM

04 Sep, 2018 0 263
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved